Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ ఇద్దరు స్టార్ల కంటే నాకే ఫాలోయింగ్ ఎక్కువ.. అందుకే ఎదురు డబ్బిస్తున్నారు..

Advertiesment
ఆ ఇద్దరు స్టార్ల కంటే నాకే ఫాలోయింగ్ ఎక్కువ.. అందుకే ఎదురు డబ్బిస్తున్నారు..
, మంగళవారం, 20 జులై 2021 (11:37 IST)
తనకు కొన్ని మీడియా సంస్థలు డబ్బులిస్తున్నాయంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆరోపణలపై అధికార వైకాపాకు చెందిన రఘురామకృష్ణం రాజు ఎద్దేవా చేశారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కంటే తనకే ఎక్కువ పాప్యులారిటీ ఉందని, అందుకే మీడియా సంస్థలు తనకు మిలియన్ల కొద్దీ యూరోలు ఇచ్చి మరీ తనతో మాట్లాడించుకుంటున్నాయంటూ ఏపీ ప్రభుత్వంపై నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు సెటైర్లు వేశారు.
 
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్ని ఓ మీడియా సంస్థ నుంచి రఘురామరాజు మిలియన్ యూరోలు తీసుకున్నట్టు ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌ దాఖలు చేసింది. దీనిపై రఘురామరాజు స్పందించారు. 
 
యూరోలలో తనకు డబ్బులు చెల్లించారన్న దానిపై మాట్లాడుతూ.. డబ్బుల బదిలీల అలవాటున్నవారు బహుశా యూరోలలో తనకు బదిలీ చేసి ఉంటారని, అందుకే ఆ పదాన్ని ప్రయోగించి ఉంటారని ఎద్దేవా చేశారు.
 
సాధారణంగా అందరూ అడిగి మరీ మీడియాలో తమ వార్తలు వేయించుకుంటారని, కానీ తనకే ఎదురు డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు ప్రసారం చేస్తున్నారని ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొందని, ఇలా ఎందుకు దిగజారిపోతారో తనకు తెలియదన్నారు. 
 
ముఖ్యమంత్రి ప్రోత్సాహంతోనే ప్రభుత్వం తనపై సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని ఆయన ఆరోపించారు. అఫిడవిట్‌లో తనపై మోపిన అభియోగాలన్నీ పసలేనివేనని కొట్టిపడేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి చాలా నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. 
 
ప్రజా సమస్యలను పక్కనపెట్టేసి గిల్లికజ్జాలు పెట్టుకుంటూ వాటికి ప్రత్యేక హోదా, పోలవరం నిధుల ముసుగు వేస్తున్నారని రఘురామ రాజు మండిపడ్డారు. విలువల గురించి పదేపదే చెబుతున్న వారు వలువల కంటే సులభంగా విలువలను వలిచేస్తున్నారన్నారు. 
 
తనపై ఇష్టం వచ్చినట్టు పేలుతున్న విజయసాయిరెడ్డి జనసేన తరపున నెగ్గిన రాపాక వరప్రసాద్‌ సహా మరో ముగ్గురు ఎమ్మెల్యేలను ఎలా కలుపుకున్నారని ప్రశ్నించారు. శ్రీరంగ నీతులు చెబుతున్నవారు తనను ఏమన్నా ఫరవాలేదు కానీ, స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోడీని ఏమైనా అంటే బాగుండదని రఘురామరాజు హెచ్చరించారు.

ఇదిలావుంటే, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌, రఘురామరాజుల మధ్య జరిగినట్టుగా భావించే వాట్సాప్ సందేశాలు, డబ్బు బట్వాడాకు సంబంధించిన ఆధారాలతో కూడిన అఫిడవిట్‌ను సుప్రీంకోర్టులో ఏపీ సీఐడీ పోలీసులు సమర్పించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెడ నొప్పి, కీళ్ళ నొప్పులున్నాయా? డెల్టా ఏమో... త‌స్మాత్ జాగ్ర‌త్త‌!!