ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో రూ.14 వేల కోట్ల రూపాయల వ్యయంతో స్థాపించిన కియా మోటార్స్ సంస్థ పక్క రాష్ట్రమైన తమిళనాడుకు తరలిపోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారానికి ఊతమిచ్చేలా ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక రాయిటర్స్ పత్రిక ఓ ప్రత్యేక కథనాన్ని కూడా ప్రచురించింది. దీనికంతా వైసీపీ ప్రభుత్వమే కారణమంటూ టీడీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. మరోపక్క, ప్లాంటును తరలించే యోచన తమకు లేదని కియా సంస్థ స్వయంగా ప్రకటించింది.
ఈ పరిస్థితుల్లో వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ వేదికలో స్పందించారు. ఏపీ నుంచి కియా మోటార్స్ తరలిపోతోందనే వార్తలో రవ్వంత కూడా నిజం లేదన్నారు. కేవలం కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు.
కియా మోటార్స్‌తో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వరంలోని రాష్ట్ర ప్రభుత్వం మంచి సంబంధాలను కొనసాగిస్తోందన్నారు. ఏపీలో కియా మోటార్స్ మరింత ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు.
అలాగే, 'రాజధాని ఎక్కడుండాలనే విషయంపై కేంద్రం క్లారిటీ ఇచ్చినప్పటి నుంచి చంద్రబాబు మైండ్‌లో వైబ్రేషన్స్ పెరిగాయి. కేంద్ర ప్రభుత్వంపైనా రుసరుసలాడుతున్నాడు. రాజధాని పెట్టడం వరకే రాష్ట్రం ఇష్టమట. మార్చే అధికారం లేదంట. ఇంకా ఏమేం రూల్సున్నాయో ఒకేసారి చెప్పేయండి విజనరీ' అంటూ విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.