ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నేతన్న నేస్తం పేరుతో చేనేత కార్మికులను ఆదుకునేందుకు పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద చేనేతలకు ఆర్థిక భరోసా కల్పించే ‘నేతన్న నేస్తం’ మూడో విడత సాయాన్ని అందించేందుకు సిద్ధమైంది.
ఈ నెల 10న ఈ పథకం కింద సొంత మగ్గం ఉన్న కార్మికులకు రూ.24 వేలు ఇస్తారు. పథకాన్ని లబ్ధిదారులకు చేరువ చేసేందుకు శనివారం నుంచి మూడు రోజులపాటు ప్రచారాన్ని నిర్వహించాలని గ్రామ, వార్డు వాలంటీర్లు సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
కార్మికులు స్థానికంగా చేనేత సంఘంలో రిజిస్టర్ అయి ఉన్నారా, లేదా అనే విషయాన్ని పరిశీలించాలని స్పష్టం చేసింది. నేతన్న నేస్తం కింద సొంత మగ్గం కలిగిన చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ.24 వేలు అందిస్తారు.
సొంతంగా మగ్గాలున్న ప్రతీ కుటుంబానికి వైఎస్ఆర్ చేనేత నేస్తం పథకం అందుతుంది. కుటుంబానికి ఎన్ని మగ్గాలున్నా ఒక యూనిట్ గానే పరిగణిస్తారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉండి, మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబం ఈ పథకానికి అర్హులు.