పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం నాసికరకంగా చేపట్టారా? ఈ ప్రాజెక్టు నిర్మించి పదేళ్లు కూడా పూర్తి కాకముందే గేటు విరిగిపోవటం అధికారుల్ని నివ్వెరపోయేలా చేసింది. ప్రమాదానికి నిర్మాణ లోపాలు కారణమా, లేక గేట్ల అమరికలో ఏమైనా తేడాలున్నాయా అని అధికారులకు అంతు చిక్కటం లేదు.
ప్రస్తుతానికి నష్ట నివారణ చర్యలపై దృష్టిపెట్టిన అధికారులు.. స్టాప్‌లాక్ గేటు ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఎగువ నుంచి వస్తున్న వరద అధికారుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కృష్ణాడెల్టా స్తిరీకరణే లక్ష్యంగా 2004లో పులిచింతల ప్రాజెక్టును చేపట్టారు. 2013 చివర్లో పూర్తైంది. కేవలం నీటి నిల్వకు మాత్రమే దీనిని ఉపయోగించేలా నిర్మించారు.
ఈ ప్రాజెక్టు శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్ సంస్థ నిర్మించింది. దాని తరపున బెకాన్ సంస్థ గేట్లు బిగించే పనులు పూర్తిచేసింది. ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు. గతేడాది అత్యధికంగా 8లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. పులిచింతలలో మొత్తం 24 గేట్లు ఉండగా నీటి ప్రవాహాన్ని బట్టి వాటిని ఎత్తేలా అధికారులు చర్యలు తీసుకుంటారు.
అయితే, గురువారం తెల్లవారుజామున కూడా ఇదే క్రమంలో గేట్లు ఎత్తేందుకు యత్నించగా 16వ నంబర్ గేటు 4 అడుగుల మేర పైకి లేచిన తర్వాత ఒక్కసారిగా శబ్దం వచ్చింది. ఏం జరిగిందా అని చూసేలోపే గేటు విరిగి నీటిలో పడిపోయింది. దీనికి కారణాలు ఇప్పుడే చెప్పలేమని ఏపీ అధికారులు అంటున్నారు.