మూకుమ్మడి రాజీనామాల దిశగా వైకాపా ... జగన్ నిర్ణయం
విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ఇప్పటికే వైకాపాకు చెందిన లోక్‌సభ సభ్యులు రాజీనామాలు చేశారు. అలాగే, ఎమ్మెల్యేలతో కూడా రాజీనామాలు చేయించాలని ఆ పార్టీ అధిన
విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ఇప్పటికే వైకాపాకు చెందిన లోక్‌సభ సభ్యులు రాజీనామాలు చేశారు. అలాగే, ఎమ్మెల్యేలతో కూడా రాజీనామాలు చేయించాలని ఆ పార్టీ అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇదే విషయాన్ని ఆయన పార్టీలోని సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలకు తెలిపినట్టు సమాచారం.
ఆదివారం పాదయాత్ర ముగించాక... కృష్ణా జిల్లా అగిరిపల్లిలో పార్టీ ఎంపీలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్యనేతలతో జగన్ సమావేశమయ్యారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు... పార్లమెంట్ బడ్జెట్ సమావేశం చివరి రోజున వైసీపీ లోక్‌సభ సభ్యులు తమ సభ్యత్వాలకు రాజీనామా చేయడం.. అనంతరం ఢిల్లీలో ఆమరణ దీక్షకు దిగడంతో నాలుగేళ్ల నుంచి హోదా కోసం చేస్తున్న పోరాటానికి ఊతమిచ్చిందని జగన్ పేర్కొన్నారు.
ఫలితంగా గతంలో స్పెషల్ ప్యాకేజీకి ఆమోదించి.. కేంద్ర అర్థికమంత్రి అరుణ్‌జైట్లీని సన్మానించిన చంద్రబాబును.. యూటర్న్ తీసుకునేలా చేసిందని అన్నారు. లోక్‌సభ సభ్యులు రాజీనామాలు సమర్పించి.. ఆమరణ దీక్షను చేపట్టాక వైసీపీ పట్ల ప్రజల్లో ఆదరణ పెరిగిందని ఒక ముఖ్యనేత ప్రస్తావించారు. ఇదే తరహాలో ఎమ్మెల్యేలూ రాజీనామాలు సమర్పిస్తే.. ప్రత్యేక హోదా ఉద్యమం హోరెత్తుతుందని వివరించారు. ఎమ్మెల్యేల రాజీనామాల అంశం పెద్ద విషయమేమీ కాదని, వ్యూహాలను దశల వారీగా ప్రకటించాల్సి ఉంటుందని జగన్ చెప్పారు. తనతో సహా ఎమ్మెల్యేలమంతా సరైన సమయంలో రాజీనామాలు చేస్తామని వారితో వ్యాఖ్యానించారు.