Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వివేకా హత్య కేసు.. సీబీఐ దూకుడు.. మరో నలుగురి విచారణ

వివేకా హత్య కేసు.. సీబీఐ దూకుడు.. మరో నలుగురి విచారణ
, గురువారం, 27 ఏప్రియల్ 2023 (14:47 IST)
వైకాపాకు చెందిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ వేగం పెంచింది. వాంగ్మూలాల సేకరణపై దృష్టి సారించింది. కొత్త వ్యక్తులను పిలిచి వాంగ్మూలాలు నమోదు చేస్తోంది. హైదరాబాద్‌ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో మంగళవారం వివేకా కుమార్తె సునీతా రెడ్డితోపాటు ఆమె భర్త రాజశేఖర్‌ రెడ్డి వాంగ్మూలాలను సేకరించింది.
 
బుధవారం మరో నలుగురిని పిలిచి విచారించింది. వివేకా హత్య జరిగిన రోజు తెల్లవారుజామునే ఘటనాస్థలికి వెళ్లిన ఇనయతుల్లాను సీబీఐ అధికారులు విచారించారు. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో కార్యాలయం లోపలికి వెళ్లిన ఇనయతుల్లా విచారణ 6.30 గంటలవరకూ సాగింది. వివేకానందరెడ్డి వద్ద ఇనయతుల్లా సుదీర్ఘకాలం కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేశారు. 
 
విధినిర్వహణలో భాగంగా నిత్యం తెల్లవారుజామునే వివేకా ఇంటికి వెళ్లే ఇనయతుల్లా.. హత్య జరిగిన రోజూ యథావిధిగానే వెళ్లారు. అప్పటికే వివేకా హత్య జరిగినట్లు తెలియడంతో మృతదేహం ఫొటోలను వాట్సప్‌ ద్వారా వివేకా కుటుంబ సభ్యులకు షేర్‌ చేశారు. ఈ విషయంపై ఇప్పటికే పలు విడతలుగా ఆయనను విచారించిన సీబీఐ.. తాజాగా మరోసారి వాంగ్మూలం సేకరించింది.
 
అలాగే, సీబీఐ అధికారులు బుధవారం మరో ముగ్గురిని విచారించారు. కడప జిల్లా తుమ్మలపల్లి యురేనియం కర్మాగారం మెకానికల్‌ విభాగం మేనేజర్లు టి.చంద్రశేఖర్‌రెడ్డి, వెంకటరాజేశ్‌, రాజులను విచారించారు. వివేకా హత్య కేసులో నిందితుడు గజ్జల ఉదయ్‌ కుమార్‌ రెడ్డి ఆ కర్మాగారంలో వీరి విభాగంలోనే పనిచేస్తున్నాడు. వివేకా హత్య జరిగిన రోజు విధులకు హాజరుకాకున్నా హాజరైనట్లు దస్త్రాల్లో నమోదు చేశారు. 
 
దీంతో హత్య జరిగిన రోజు అంతకు ఒకట్రెండు రోజుల ముందు ఉదయ్‌ కుమార్‌ రెడ్డి విధులకు హాజరయ్యాడా..? హత్యానంతరం కర్మాగారానికి వచ్చాడా.. అన్న వివరాలు మేనేజర్ల ద్వారా నిర్ధారించుకుంటున్నట్లు తెలిసింది. మరోవైపు ఉదయ్‌ కుమార్‌ రెడ్డి జ్యుడిషియల్‌ రిమాండ్‌ను సీబీఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానం పొడిగించింది. బుధవారం నుంచి 14 రోజులపాటు జ్యూడీషియల్‌ కస్టడీలో ఉండాలని ఆదేశించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అవి ఆర్మీ హెలికాఫ్టర్లు... దేశ భద్రతలో జోక్యం చేసుకోలేం : వైవీఎస్ చౌదరి