మాజీ మంత్రి వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీలోని అధికార వైకాపాకు చెందిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు 26వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఈ నెల 25వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని, దర్యాప్తు సమయంలో అతని నుంచి ప్రశ్న, జవాబులను లిఖిత/ప్రింట్ రూపంలో తీసుకోవాలని, ప్రశ్నావళిని ముందస్తుగా అందించాలని తెలంగాణ హైకోర్టు ఈ నెల 18న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణపై మంగళవారం విచారణ జరిపింది. ఇరు పక్షాల వాదనలు ఆలకించకుండానే ఈ కేసు విచారణను బుధవారానికి కోర్టు వాయిదా వేసింది. దీంతో అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ వస్తుందా రాదా అనే ఉత్కంఠత మరో 24 గంటల పాటు కొనసాగనుంది.