ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, వైకాపా నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును దర్యాప్తును సీబీఐ అధికారులు వేగవంతం చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మరో నలుగురు అనుమానితులను విచారించారు.
వీరిలో పులివెందుల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, తొండూరు జడ్పీటీసీ మాజీ సభ్యుడు శివమోహన్ రెడ్డి ఉన్నారు. కడపలో వీరిని విచారించిన అధికారులు వారి నుంచి కీలక విషయాలను రాబట్టినట్టు సమాచారం.
అదేవిధంగా, పులివెందులకు చెందిన చెప్పుల దుకాణం యజమాని మున్నా, అతడి తల్లి బీబీని పులివెందుల ఆర్ అండ్ బీ అతిథిగృహంలో విచారించారు. హత్య జరగడానికి రెండు నెలల ముందునుంచీ వివేకానందరెడ్డి ఎవరెవరితో ఫోన్‌లో మాట్లాడారో కాల్‌డేటా ద్వారా వివరాలు సేకరించారు.
ఈ కాల్ డేటా ఆధారంగా అధికారులు అనుమానితులను విచారిస్తున్నారు. ఈ కేసులో కడప వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు.. ఆన తండ్రిని సీబీఐ విచారణ జరిపిన విషయం తెల్సిందే.