విపక్షాల ఒత్తిడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గింది. అంతర్వేదిలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి చెందిన రథం దగ్ధమైన ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.
అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయ రథం గత శనివారం అర్థరాత్రి అగ్నికి ఆహుతైంది. దీనిపై రాష్ట్రవ్యాప్త ఆందోళనలు జరిగాయి. విపక్ష పార్టీలన్నీ కలిసి ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది. రాష్ట్రం నలుమూలల నుంచి వెల్లువెత్తిన నిరసనలతో చేసేదిలేక చివరకు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ ఘటన వెనుక శక్తులు ఎవరున్నారో నిగ్గుతేల్చే బాధ్యతను ఆ సంస్థకు కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం రాత్రి సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
రథం అగ్నికి ఏవిధంగా ఆహుతైంది? దీనివెనుక ఎవరున్నారో తేల్చే బాధ్యతను సీబీఐకి అప్పగించాలని డీజీపీని ఆదేశించారు. దీంతో డీజీపీ కేంద్ర హోంశాఖకు లేఖరాశారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వుల జీవో శుక్రవారం జారీ అయ్యే అవకాశం ఉంది.
కాగా ఈ ఘటనలో ఇప్పటికే పోలీసుశాఖ విచారణ చేపట్టినా ఇంతవరకు నిందితుల జాడ కనిపెట్టలేకపోయింది. దీంతో ప్రభుత్వంపై మరింత విమర్శల దాడి మరింత పెరగడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఈ విమర్శల నుంచి తప్పించుకునేందుకు సీబీఐ విచారణకు ఆదేశించింది.