Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహిళల కోసం వైఎస్ఆర్ ఆసరా... 87 లక్షల మందికి లబ్ది

మహిళల కోసం వైఎస్ఆర్ ఆసరా... 87 లక్షల మందికి లబ్ది
, శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (11:28 IST)
గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలో భాగంగా, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మహిళల కోసం వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని శుక్రవారం నుంచి ప్రారంభించనున్నారు. అధికారంలోకి వచ్చిన రెండో యేట నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తామని నాడు జగన్ ప్రకటించారు. అలాగే, ఇపుడు ఈ పథకానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. 
 
గత అసెంబ్లీ ఎన్నికల రోజు నాటికి (2019 ఏప్రిల్‌ 11) పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉండే అప్పు మొత్తాన్ని నాలుగు విడతల్లో చెల్లించే ఈ పథకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. 8,71,302 పొదుపు సంఘాల్లో 87,74,674 మంది మహిళల పేరుతో బ్యాంకుల్లో ఉన్న అప్పు రూ.27,168.83 కోట్లను ప్రభుత్వం నాలుగు విడతల్లో నేరుగా ఆయా సంఘాల పొదుపు ఖాతాల్లో జమ చేయనుంది. 
 
ఇందులో భాగంగా తొలి ఏడాది రూ.6,792.20 కోట్లను ఆయా కార్పొరేషన్ల ద్వారా శుక్రవారం జమ చేయనుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మొత్తాన్ని ఎలా ఖర్చు చేసుకోవాలన్న నిర్ణయాన్ని అక్కచెల్లెమ్మలకే వదిలేస్తున్నామని, బ్యాంకర్లు ఆ మొత్తాన్ని పాత అప్పులకు మినహాయించుకోకూడదని సర్కార్‌ స్పష్టం చేసింది. 
 
ఈ వైఎస్సార్‌ ఆసరా పథకం ప్రారంభోత్సవాన్ని వారం రోజుల పాటు ఉత్సవంలా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధించి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) సీఈవో రాజాబాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 
 
శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం జగన్‌ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. మహిళలకు రూ.6,792 కోట్లకు సంబంధించిన చెక్కును సీఎం లాంఛనంగా అందజేస్తారు. 
 
ఈ కార్యక్రమం ప్రతి గ్రామంలోని పొదుపు సంఘాల మహిళలు తిలకించేలా రైతు భరోసా కేంద్రాల్లో వీడియో వసతి ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టర్, సంబంధిత జిల్లా మంత్రులతో పాటు ఐదు పొదుపు సంఘాలకు చెందిన మహిళలు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. 
 
సీఎం జగన్‌ రాసిన లేఖ కాపీలను జిల్లా కేంద్రాల్లో మంత్రులు మహిళలకు అందజేస్తారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటి మందికి కరోనా... వచ్చిందట.. పోయిందట...!!