హిందూ ధర్మ పరిరక్షణ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో కట్టుబడివుంది. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదని రాష్ట్ర దేవాలయ పాలన సంస్థ డైరెక్టరు, అర్చక ట్రైనింగ్ అకాడెమీ డైరెక్టరు కృష్ణశర్మలు మంగళవారం సంయుక్తంగా విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
ఇదే అంశంపై వారు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో... అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి సంబంధించిన రథం దగ్ధమైన ఘటనకు సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరు... డీజీపీ నేతృత్వంలో విచారణ జరుగుతున్న వైనం ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దం పడుతోందన్నారు.
హిందువుల మనోభావాలకు సంబంధించిన ఈ ఘటనకు కారణమైన అసలు దోషులను గుర్తించేందుకు, పోలీసులతో పాటు దేవాదాయ శాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలకు హిందూ సమాజానికి చెందిన ప్రతి ఒక్కరు సహకరించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
ఈ ఘటనను రాజకీయ వివాదంగా మార్చడం వల్ల.. అసలు దోషులు తప్పించుకునే ప్రమాదం ఉందని, ఈ సున్నితమైన విషయాన్ని గమనించి, ప్రభుత్వానికేకాకుండా హిందూ సమాజానికి సవాలు విసురుతున్న అసలు దుండగులను పట్టుకునేందుకు ఎలాంటి అవరోధాలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తుచేశారు.
ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించినట్టు వారు విడుదలచేసిన ప్రకటనలో పేర్కొన్నారు.