గత ఐదేళ్ల వైకాపా పాలనలో జరిగిన అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, సెటిల్‌మెంట్లు ఇపుడు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అధికారం ఉండటంతో పాడిందే పాటగా వైకాపా నేతలు రెచ్చిపోయారు. మనల్ని ఎవడ్రా ఆపేది అనేలా ప్రవర్తించారు. అడ్డూ అదుపు లేకుండా నడుచుకున్నారు. వైకాపా నేతల అరాచకాలతో సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు అనేక రకాలైన ఇబ్బందులకు గురయ్యారు. అయితే, 2024లో జరిగిన ఎన్నికల్లో వైకాపాకు చావుదెబ్బ తగిలింది. దీంతో జగన్ హయాంలో చేసిన పాపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
ఇలాంటి వాటిలో ఒకటి ముంబైకు చెందిన హీరోయిన్ జత్వాల్ కాదంబరి ఒకరు. ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్‌పై అత్యాచారం కేసు ముంబైలో పెట్టడమే ఆమె చేసిన నేరం. ఆ కేసును వైకాపా పాలకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెటిల్ చేశారు. అత్యాచారం కేసును ఉపసంహరించుకోవాలంటూ ఆ నటితో పాటు వృద్ధులైన ఆమె తల్లిదండ్రులను ముంబై నుంచి విజయవాడకు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత 40 రోజుల పాటు నరకయాతన చూపించారు. జైలుకు పంపించారు. రిమాండ్‌లో ఉంచారు. శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురిచేశారు. ఇందులో వైకాపా నేత కుక్కల విద్యాసాగర్ కీలక పాత్ర పోషించారు. బాలీవుడ్ నటిపై తప్పు కేసు పెట్టాడు. ఆ తర్వాత విజయవాడకు తీసుకొచ్చి ఆమెపై వ్యభిచారిణి అనే ముద్ర వేస్తామంటూ బెదిరించి లొంగదీసుకున్నారు.
బాలీవుడ్‌లో పలు సినిమాలు, సీరియల్స్‌లలో నటించి మంచి గుర్తింపు ఉన్న జత్వాల్.. పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్, ఆ తర్వాత వైకాపా నేత కుక్కల విద్యాసాగర్‌తో ప్రేమలో పడింది. అయితే, పెళ్లికి నవీన్ జిందాల్ కుటుంబం అంగీకరించలేదు. పైగా, తనపై కేసుపెట్టినందుకు తనకు అనుచరుడైన అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆశ్రయించి కేసు నుంచి రక్షించాలంటూ ప్రాధేయపడ్డారు. ఫలితంగా అత్యాచారం కేసును నటి వెనక్కి తీసుకున్నారు. కానీ, ఆ నటిపై పెట్టిన తప్పుడు కేసులు మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సెటిల్‌మెంట్ కేసు ఇపుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.