ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ఆ తర్వాత ఆ పార్టీ నేతల్లో ఆతర్మథనం మొదలైంది. గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన దృష్ట్యా రాష్ట్రంలో పార్టీకి భవిష్యత్ లేదనే నిర్ణయానికి దాదాపుగా ఆ పార్టీ నేతలు వస్తున్నట్టు సమాచారం. ఇందులోభాగంగా ఇప్పటికే అనేక మంది నేతలు ఆ పార్టీకి రాజీనామా చేయగా, మరికొందరు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారు.
మరోవైపు, వైకాపాకు చెందిన 11 మంది ఎంపీల్లో పది మంది రాజీనామా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీరిలో టీడీపీలోకి ముగ్గురు, బీజేపీలోకి ఐదుగురు, జనసేనలోకి ఇద్దరు చేరుతానే ప్రచారం సాగుతుంది. ముఖ్యంగా, తెలుగుదేశం పార్టీలోకి మోపిదేవి వెంకట రమణ, గొల్ల బాబూరావు, బీద మస్తాన్ రావు, బీజేపీలోకి రఘునాథ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, జనసేన పార్టీలోకి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్.మస్తానయ్యలు చేరబోతున్నట్టు ప్రచారం సాగుతుంది. ఈ రాజ్యసభ సభ్యుల చేరికలు కూడా గురువారం నుంచి మొదలవుతాయన్నది వినికిడి. ఇదే నిజమైతే త్వరలోనే వైకాపా దుకాణం బంద్ కావడం ఖాయంగా తెలుస్తుంది.
ఎన్నికల్లో వైకాపాకు చావుదెబ్బ... ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా!
గత మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైకాపాకు చావుదెబ్బ తగిలింది. ఈ ఓటమిని వైకాపా నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో అనేక మంది నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి టాటా చెప్పగా, ఇపుడు రాజ్యసభ సభ్యుడు, మాజీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన మోపిదేవి వెంకట రమణ కూడా పార్టీని వీడినున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో వైకాపా ఎమ్మెల్సీగా ఉన్న పోతుల సునీత పార్టీకి రాజీనామా చేశారు. అలాగే, పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు శాసనమండలికి పంపించారు.
కాగా, పోతుల సునీత ఏ పార్టీలో చేరేది తెలియరాలేదు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని ఆమె వెల్లడించారు. పోతుల సునీత వైకాపా రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఉన్న విషయం తెల్సిందే. అలాంటి మహిళ నేత పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.