కల్నల్ సోఫియా ఖురేషిపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) పార్లమెంటు సభ్యురాలు కున్వర్ విజయ్ షా చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎపిసిసి) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా ఖండించారు. అవి తీవ్ర అవమానకరమైనవని ఫైర్ అయ్యారు.
ఆపరేషన్ సింధూర్‌లో కల్నల్ సోఫియా ఖురేషి ముఖ్యమైన పాత్ర పోషించారు. ఎంపి చేసిన మతపరమైన, లింగ ఆధారిత వివక్షత వ్యాఖ్యలు ప్రమాదవశాత్తు కాదని, బీజేపీ మనస్తత్వం అని షర్మిల అన్నారు. మహిళా ఆర్మీ అధికారిణి పట్ల కున్వర్ విజయ్ షా చేసిన వ్యాఖ్యలపై షర్మిల ఇంకా మాట్లాడుతూ.. అది కేవలం నోరు జారడం కాదని చెప్పారు.
దేశభక్తి ముసుగు వెనుక ద్వేషాన్ని దాచిపెట్టి, మత రాజకీయాలలో పాల్గొనడం బిజెపికి అలవాటుగా మారింది. ఎన్నికల లాభాల కోసం, వారు భారతీయుల మధ్య విభజన రేఖలు గీస్తున్నారు. మన సమాజం, సున్నితమైన నిర్మాణాన్ని అస్థిరపరుస్తున్నారని షర్మిల విమర్శించారు.
జాతీయ ఐక్యతకు హాని కలిగించే, మహిళలను అవమానించే, ప్రజాస్వామ్యానికి అవమానం కలిగించే వ్యక్తులను భారతదేశం తిరస్కరించాల్సిన సమయం ఆసన్నమైందని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.