కరోనా వైరస్ పైన టిటిడి అప్రమత్తమైంది. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం, సప్తగిరి తనిఖీ కేంద్రం, శ్రీవారి మెట్టు వద్ద ప్రత్యేకంగా కౌన్సిలింగ్, సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేసి భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా స్ప్రేలను చేతులకు కొడుతూ శుభ్రపరుచుకోమని సూచనలు చేస్తున్నారు.
టిటిడినే కాదు తిరుపతిలో రైల్వేశాఖ కూడా చాలా అప్రమత్తంగా ఉంది. తిరుపతి నుంచి బయలుదేరే రైళ్ళలో స్ప్రేలను కొడుతున్నారు. రైల్వేస్టేషన్ లోనే భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు. జ్వరం ఎక్కువగా ఉన్నా, జలుబు, దగ్గు ఉన్నా వెంటనే అలాంటి వారిని గుర్తిస్తున్నారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో ఉన్న ఐసోలేషన్ వార్డుకు రెఫర్ కూడా చేస్తున్నారు.
ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే కరోనా వైరస్ వచ్చే అవకాశం లేదని ఇప్పటికే వైద్యులు తేల్చారు. అయితే తిరుపతితో పాటు చిత్తూరు జిల్లాలో అధిక ఉష్ణోగ్రత ఉండటంతో వైరస్‌లు సోకే ప్రమాదం లేదని వైద్యులు చెపుతున్నారు. అయినా సరే ప్రజలు అప్రమత్తంగానే ఉండాలని మాత్రం వైద్యులు సూచిస్తున్నారు. వ్యక్తిగత శుభ్రతను తూచా తప్పకుండా పాటించాలంటున్నారు.
అలాగే శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల్లో ఎవరైనా అస్వస్థతకి గురైతే భక్తులు తిరుమల యాత్రను రద్దు చేసుకుని వారి టికెట్టును
[email protected]కి మెయిల్ చేస్తే మరో రోజు దైవదర్శనం ఏర్పాటు చేసుకోవడానికి లేదా నగదు తిరిగి పొందడానికి వీలుంటుందని తితిదే వెల్లడించింది. ఇంకా కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మంగళవారం ఈ నెల 17నుండి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని గదులలో వేచి ఉండే వీలు లేదనీ, టైమ్ స్లాట్ ప్రకారం వారు పొందిన టైమ్‌కి క్యూలో నేరుగా స్వామిదర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపారు.