ప్రస్తుత రోజులలో ఆడపిల్లలు ఎంతో జాగ్రత్తగా ఉండాలని, సమాజంలో నూటికి 70 మంది మగవాళ్ళు ఆడవారికి మాయమాటలు చెప్పి లోబరుచుకునే యత్నాలలో నిమగ్నమై ఉంటారని, అమాయకంగా కొందరు మహిళలు అటువంటివారికీ అవకాశం ఇచ్చినపుడే ఆ స్త్రీలు మోసానికి ఎక్కువగా గురవుతున్నారని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు.
బుధవారం మంత్రి మచిలీపట్నంలోని తన కార్యాలయం వద్దకు వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున వచ్చిన ప్రజల సమస్యలను ఓపిగ్గా విన్నారు. మంచిలిపట్నం ఓగీస్ పేటకు చెందిన ఒక మహిళ తన కుమార్తెను గుంటూరులో ఉంటున్న పిల్ల మేనమామకు ఇచ్చి పెళ్లి చేసేందుకు ప్రధానం చేశానని, ఇపుడు పెళ్లి చేసుకునేందుకు పలు షరతులు పెడుతూ, అధిక మొత్తంలో కట్నం ఇవ్వాలంటూ ఎన్నో ఇబ్బందులు పెడుతున్నట్లు మంత్రి నానికి మొరపెట్టుకొంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వంత వ్యక్తిత్వం, సరైన ఆదాయం, భార్యను పోషించుకొనే శక్తి లేనివారికి బంగారం లాంటి పిల్లలను ఇచ్చి ముప్పు తెచ్చుకోవద్దని తెలిపారు. మాచవరంకు చెందిన వేమూరి పద్మ అనే మహిళ మంత్రి పేర్ని నానికి తన భర్తకు పక్షవాతం సోకి ఇంట్లో మంచానికే పరిమితమయ్యాడని, కుటుంబ పోషణ చాలా భారంగా ఉందని తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని వేడుకొంది.
స్వీపర్ ఉద్యోగమైనా చేసేందుకు సిద్దపడి ఉన్నట్లు ఆమె పేర్కొంది. స్పందించిన మంత్రి ఆమె పూర్తి వివరాలు తన కార్యాలయంలో అందచేయాల్సిందిగా సూచించారు. స్థానిక నిజాంపేటకు చెందిన పాస్టర్ బి. ఇజ్రాయేలు పాల్ మంత్రిని కలిసి గత రెండు నెలలకు పైగా లాక్డౌన్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్చకులు, పాస్టర్లు, మౌజమ్‌లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.5 వేలు చొప్పున మంగళవారం ఆర్థిక సాయం చేసిందని, అయితే తనకు అన్ని అర్హతలు ఉన్నా ఆ సహాయం అందలేదని మంత్రి పేర్ని నానికి తెలిపారు.
తన ఆస్తిని కాజేయాలని కన్నకొడుకు నాగమ్మల్లేశ్వరావు చూస్తున్నారని, తన ప్రాణాలకు ముప్పు ఉందని తనను ఎలాగైనా రక్షించాలని నిజాంపేటకు చెందిన పొట్టూరి నాంచారమ్మ మంత్రి పేర్ని నానికి విజ్ఞప్తి చేసింది.