ఇప్పటివరకు ప్రజలు అందించిన సహకారంతో రాష్ట్రంలో 80 శాతం ప్రాంతాలలో కరోనా విస్తరించకుండా నియంత్రించగలిగామని సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్, ఎక్స్- అఫీషియో స్పెషల్ సెక్రటరీ మరియు కోవిడ్-19 రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ మెంబర్ తుమ్మా విజయ్‌కుమార్ రెడ్డి మంగళవారం తెలిపారు.
కోవిడ్-19 అనుమానిత లక్షణాలు కలిగిన వారితో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తులందరూ స్వీయ నిర్భంధాన్ని పాటించడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో ప్రభుత్వానికి సహకరించాలన్నారు. కోవిడ్-19 అనుమానిత లక్షణాలు కలిగిన వ్యక్తులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తారని, అయితే ఇంట్లోనే తగిన వసతులు ఉండి స్వీయ నిర్భంధాన్ని పాటించేవారు మాత్రం ప్రభుత్వ మార్గదర్శకాలు తప్పనిసరిగా ఆచరించాలన్నారు.
స్వీయ నిర్భంధం పాటించే వ్యక్తి మంచి గాలి, వెలుతురుతో పాటు మరుగుదొడ్డి సౌకర్యం కలిగి ఉండే గదిని ఎంచుకోవడంతో పాటు సహాయ సహకారాలు కోసం ప్రత్యేకంగా ఒకరిని నియమించుకోవాలన్నారు. సబ్బు నీరు లేదా ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్‌తో తరచూ చేతులను కడుక్కోవాలని, వారుండే గదితో పాటు వారు తాకే వస్తువులు, పరిసరాలను, మరుగుదొడ్డిని వారే ఒక శాతం కలిగిన సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో శుభ్రపరచుకోవాలని తెలిపారు.
ఇంట్లో కుటుంబ సభ్యులతో భౌతిక దూరం పాటించాలని, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, పిల్లలకు దూరంగా ఉంటూ కేవలం భోజనం తీసుకునేటప్పుడు మాత్రమే వారిని గది ద్వారం వరకు అనుమతించాలన్నారు. ఒక వేళ ఇద్దరు వ్యక్తులు ఒకే గదిలో ఉండాల్సి వస్తే కనీసం ఒక మీటర్ దూరం పాటించాలన్నారు.
స్వీయ నిర్భంధంలో ఉన్నన్ని రోజులు అన్ని వేళలా తప్పనిసరిగా మాస్క్ ధరిస్తూ, ప్రతి 6 నుండి 8 గంటలకు మాస్క్ లు మార్చాలని,డిస్పోజబుల్ మాస్క్ లు తిరిగి ఉపయోగించరాదన్నారు. పాజిటివ్ పేషెంట్, ఆరోగ్య కార్యకర్తలు వారి దగ్గరి సంబంధీకులు ఉపయోగించిన మాస్కులను సాధారణ బ్లీచ్ ద్రావణం(5శాతం) లేదా సోడియం హైపోక్లోరైట్ ద్రావణం ఉపయోగించి శుభ్రపరచిన అనంతరం వాటిని కాల్చివేయాలి లేదా పూడ్చి వేయాలన్నారు.
స్వీయ నిర్భంధ కాలంలో సందర్శకులతో ఎట్టిపరిస్థితులలో కలవ కూడదని ఒకవేళ స్వీయ నిర్భంధం లో ఉన్న వ్యక్తికి పాజిటివ్ వస్తే అతనిని కలిసిన వ్యక్తులందరి వివరాలు ప్రభుత్వానికి తెలియజేసి వారి రిపోర్టు కూడా నెగిటివ్ వచ్చేవరకు స్వీయ నిర్భంధంలో ఉంచటానికి సహకరించాలన్నారు.
జ్వరం, జలుబు, పొడిదగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు ఉన్నట్లైతే ఆ ప్రాంతంలో ఉండే గ్రామ/వార్డు వాలంటీర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. కోవిడ్-19 కు సంబంధించి మరింత సమాచారం కోసం 104 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి కానీ వాట్సప్ చాట్ బాట్ నెంబర్ 8297104104కు హాయ్ అని మెసేజ్ చేసి అధికారిక సమాచారం పొందవచ్చని తుమ్మా విజయ్‌కుమార్ రెడ్డి తెలిపారు.