ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణాకు వచ్చే వాహనాలను మానవతా దృక్పథంతోనే అనుమతిస్తామని నల్గొండ డీఐజీ రంగనాథ్ చెప్పారు. ఈ పాస్ లేనివారు అత్యవసర వైద్య చికిత్స కోసం వచ్చినట్టైతే, తగిన ఆధారాలను చూపించాలని... అప్పుడు వారిని మానవతా దృక్పథంతో అనుమతిస్తామని చెప్పారు.
కాగా, కరోనా కష్టకాలంలో ఏపీ నుంచి వస్తున్న ప్రజలను సరిహద్దుల్లో తెలంగాణ పోలీసులు నిలిపివేస్తున్నారు. ఈ అంశం ఇపుడు దేశ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ పోలీసుల వైఖరి కారణంగా సరిహద్దుల్లో వందలాది వాహనాలు ఆగిపోయివున్నాయి.
ఈ సందర్భంగా నల్గొండ డీఐజీ రంగనాథ్ మాట్లాడుతూ, ఏపీ నుంచి వస్తున్న వారికి పలు సూచనలు చేశారు. ఏపీ ప్రభుత్వం లేదా ఏపీ, తెలంగాణ పోలీసులు జారీ చేసిన పాస్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఏపీ నుంచి వచ్చేవారు పోలీసుల సూచనలను పాటించాలని తెలిపారు. ఈ పాస్ లేకుండా వచ్చి సరిహద్దుల్లో ఇబ్బంది పడవద్దని సూచించారు.
అంబులెన్సులపై ఎలాంటి ఆంక్షలు ఉండవని... అయితే కోవిడ్, ఇతర రోగులు ఆసుపత్రులు ఇచ్చిన లెటర్స్, సంబంధిత పత్రాలను పోలీసులకు చూపించాల్సి ఉంటుందని రంగనాథ్ చెప్పారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఏపీ నుంచి వచ్చే వాహనాలను అనుమతిస్తామని తెలిపారు.