తెలంగాణా రాష్ట్రంలో తక్షణమే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీపీఎం-జేఎవై) పథకం అమలు చేయడానికి అవగాహన ఒప్పందాన్ని నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్‌హెచ్‌ఏ) చేసుకుంది. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రస్తుతం రాష్ట్రంలో అమలులో ఉన్న ఆరోగ్యశ్రీ పథకంతో మిళితం చేయడంతో పాటుగా ఈ సమ్మిళిత పథకాన్ని ఆయుష్మాన్ భారత్ పీఎం-జే ఆరోగ్యశ్రీగా పిలుస్తారు.
ఆయుష్మాన్ భారత్ పీఎం-జె పథకాన్ని తెలంగాణాలో అమలులోకి తీసుకురావడం ద్వారా ఇది దేశంలో 33 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించినట్లయింది. ఈ పథకం ద్వారా ఎస్‌ఈసీసీ డాటా 2011 ప్రకారం తెలంగాణా రాష్ట్రంలో దాదాపు 26 లక్షల కుటుంబాలు (దాదాపు 1.3కోట్ల మంది వ్యక్తులు) లబ్ధి పొందుతాయి.
ఈ పథకం ద్వారా ఒక్కో కుటుంబం సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల వరకూ ఉచిత ఆరోగ్య భీమా కవరేజీని పొందుతుంది. ఈ ఆరోగ్య సేవలు దేశవ్యాప్తంగా నమోదు చేసుకున్నటువంటి 22 వేల ఆస్పత్రులలో లభ్యమవుతాయి. ఎన్‌హెచ్‌ఏతో పాటుగా రాష్ట్ర ఆరోగ్య ఏజెన్సీలు అర్హులైన లబ్ధిదారులందరికీ ఈ పథకం వర్తించేలా తగు చర్యలు తీసుకోవడంతో పాటుగా ఈ సమ్మిళిత పథకం ద్వారా ఉచిత ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తుంది.
ఈ సందర్భంగా నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవో డాక్టర్ ఆర్‌ఎస్ శర్మ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏబీ-పీఎం జే పథక అమలు కోసం తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంతో చేతులు కలుపడం పట్ల సంతోషంగా ఉన్నాము. రాష్ట్రంలోని లబ్ధిదారులు ఇప్పుడు దేశవ్యాప్తంగా 22 వేల నెట్‌వర్క్ ఆస్పత్రులలో సేవలు పొందేందుకు అర్హులు. రాష్ట్రంలోని అర్హులైన కుటుంబాలతో పాటుగా తెలంగాణా రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెంది నివాసముంటున్న వారికి సైతం ఇది ప్రయోజనం కలిగించనుంది. ప్రదాతల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. మా కాల్ సెంటర్‌కు ఇప్పటికే రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రజల నుంచి కాల్స్ వస్తున్నాయి. అర్హత కలిగిన లబ్ధిదారులకు ఈ పథక ప్రయోజనాలను అందించేందుకు కట్టుబడి ఉన్నాము అని అన్నారు
ఈ పథకం కింద తమ అర్హతను తెలుసుకునేందుకు లబ్ధిదారులు 14555 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయవచ్చు. అలాగే ఈ పథక ప్రయోజనాలను ఏ విధంగా పొందవచ్చో కూడా తెలుసుకోవచ్చు.