అనంతపురం జిల్లాలో కరడుగట్టిన టీడీపీ కుటుంబం పరిటాల వారు ఆ పార్టీని వీడనున్నారా?... వైసీపీలో గానీ, బీజేపీ లో చేరాలనుకుంటున్నారా?.. అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలని, పట్టు కాపాడుకోవాలని భావిస్తున్న తెలుగుదేశం పార్టీకి ఊహించని విధంగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. రాజకీయంగా బలంగా లేని ఆ పార్టీకి బలమైన నేతలు ఊహించని దెబ్బ కొడుతున్నారు.
చంద్రబాబు నమ్మిన వాళ్ళే ఇప్పుడు ముంచుతున్నారు. మాజీ మంత్రులు, టీడీపీ సీనియర్ నేతలు ఒక్కొక్కరు పార్టీ మారడానికి సర్వం సిద్దం చేసుకుంటున్నారు. తాజాగా పార్టీ మారడానికి పరిటాల ఫ్యామిలీ కూడా సిద్దమైంది. పరిటాల శ్రీరాం ఇప్పటికే జిల్లా మంత్రిని ఒకరిని కలిసి పార్టీలోకి వచ్చే విషయమై చర్చలు జరిపారని అంటున్నారు.
ఆయన ఇప్పటికే పరిటాల అభిమానులతో కూడా చర్చలు జరిపి పార్టీ మారే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. పరిటాల అభిమానులు కొంత కాలంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై ఆగ్రహంగా ఉన్నారు. జేసి ఫ్యామిలీకి ఇచ్చిన విలువ తమకు ఇవ్వడం లేదనే భావనలో వారు ఉన్నారు. దీనితో త్వరలో పార్టీకి గుడ్ బై చెప్పడానికి రెడీ అవుతున్నారని సమాచారం.
అన్ని విధాలుగా టీడీపీ లో సహకారం అనేది లేదని, కార్యకర్తల మీద, నమ్ముకున్న అనుచరుల మీద కేసులు పెడుతున్నారని శ్రీరాం ఆగ్రహంగా ఉన్నారు. జేసి కి న్యాయ సహాయం అందింది కాని తమకు పార్టీ నుంచి అందడం లేదని శ్రీరాం అసహనంగా ఉన్నారు. దీనితో ఉగాది తర్వాత పార్టీ మారడానికి శ్రీరాం అన్ని సిద్దం చేసుకున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆయన ఈలోపే వెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.
ఇక పరిటాల సునీత కూడా ఈ విషయంలో అసహనంగా ఉన్నారని, తమకు పార్టీ అధిష్టానం నుంచి ఏ మాత్రం మద్దతు రావడం లేదనే భావనలో ఆమె ఉన్నారని జిల్లా నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. చూడాలి ఎం జరుగుతుందో.