Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాష్ట్ర విభజన చట్టంలోని హామీలన్నీ అమలయ్యేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తాం: రాజ్యసభ సభ్యులు

రాష్ట్ర విభజన చట్టంలోని హామీలన్నీ అమలయ్యేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తాం: రాజ్యసభ సభ్యులు
, గురువారం, 23 జులై 2020 (09:23 IST)
రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు పూర్తిగా అమలయ్యేలా కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొస్తామని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. బుధవారం రాజ్యసభ సభ్యులుగా పిల్లి సుభాష్ చంద్రబోస్ తో పాటు అయోధ్యరామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ ప్రమాణ స్వీకారం చేశారు.

వారు విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తమకు రాజ్యసభ సభ్యులుగా అరుదైన అకాశమిచ్చారని, ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ, తనతో పాటు మోపిదేవి వెంకటరమణ, అయోధ్యరామిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశామన్నారు.

మోపిదేవి వెంకటరమణ తో పాటు తాను వెనుకబడిన తరగతులకు చెందినవారమన్నారు. బీసీలకు పార్లమెంట్ సభ్యులుగా అకాశమిచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు.

రాష్ట్ర విభజన చట్టంలో ఆనాడు ఇచ్చిన హామీలు ఇంకా అమలు కావల్సి ఉందన్నారు. వాటిని అమలయ్యేలా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తామన్నారు. వాటితో పాటు రెవెన్యూ లోటు మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించాల్సి ఉందన్నారు.

రూ.16 వేల కోట్ల రెవెన్యూ లోటుకు గానూ కేవలం రూ.4 నుంచి 5 వేల కోట్లు మాత్రమే ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఊరుకోవడం దురదృష్టకరమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విశాల దృక్పథంతో ఆలోచించి, ఏపీని ఆదుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ లో పేదలను సామాజికంగా, ఆర్థికంగా ఆదుకోవాలన్న ఉద్దేశంతో సీఎం జగన్మోహన్ రెడ్డి రూ.42 వేల కోట్లు వెచ్చిస్తున్నారన్నారు.

ఇది చాలా మొత్తం అని, ఏపీ బడ్జెట్ లో 20 శాతమని, ఆల్ టైమ్ రికార్డు అని కొనియాడారు. ఒక వైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు వ్యవసాయానికి సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారన్నారు. రూ.19 వేల కోట్లను ఈ ఏడాది వ్యవసాయానికి కేటాయించారన్నారు. ఆరోగ్యం, వైద్యానికి కూడా పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తున్నారన్నారు.

విద్య, ఆరోగ్యంపై వెచ్చిస్తున్న నిధులను పెట్టుబడిలా కాకుండా కేపిటిల్ ఇన్వెస్ట్ మెంట్ (మూలధన పెట్టుబడి)గా సీఎం భావిస్తున్నారన్నారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోందని, ఇటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

ప్రస్తుత కరోనా కష్ట కాలంలో దేశంలో ఉన్న 60 కోట్ల పేద కుటుంబాలను ఆదుకోవాలంటూ ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రిని కోరుతున్నానన్నారు. మరో సభ్యులు మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ, తమ రాజకీయ జీవితంలో ఈ రోజు మరుచిపోలేని రోజని అన్నారు. రాజ్యసభ సభ్యుల ఎంపికలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని తమకు సీఎం జగన్మోహన్ రెడ్డి అవకాశమిచ్చారన్నారు.

రాజ్యసభ సభ్యుల ఎంపికలో వ్యాపార వర్గాల వారికే ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యమిస్తూ వస్తున్నాయన్నారు. వాటికి భిన్నంగా వెనుకబడిన వర్గానికి చెందిన ఇద్దరికి అవకాశమివ్వడం ఏపీ రాజకీయచరిత్రలోనే మొట్టమొదటిసారన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఏపీ అస్తవ్యస్తంగా ఉన్న దశలో పరిపాలన చేపట్టిన సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారన్నారు.

ముఖ్యంగా గ్రామ సచివాలయ వ్యవస్థపై ఎన్నో రాష్ట్రాలు ఆరా తీసున్నాయన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని లక్ష్యంతో సీఎం జగన్ పనిచేస్తున్నారన్నారు. దేశంలోనే బలమైన ప్రాంతీయ పార్టీకి వైసీపీ అవతరించిదన్నారు.

కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన అన్ని రకాల నిధులు రాబట్టడానికి కృషి చేస్తామన్నారు. మరో రాజ్యసభ సభ్యులు అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ, తమ మీద నమ్మకం పెద్దల సభకు మా నలుగురిని ఎంపిక చేశారన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచనల ప్రకారం రాష్ట్రాభివృద్ధికి తమ పార్లమెంటరీ పార్టీ తీసుకున్న నిర్ణయాల మేరకు పనిచేస్తామన్నారు.

వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక సదుపాయలు, సేవా రంగం పరిశీలిస్తే...ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావసరాలకనుగుణంగా రాజ్య సభ వేదికగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టుకుంటాం. అనంతరం రాజ్యసభ సభ్యులు మిధున్ రెడ్డి మాట్లాడుతూ, ఒక్క సభ్యునితో రాజ్యసభలో వైసీపీ ప్రస్థానం ప్రారంభమైందని ప్రస్తుతం ఆరుగురికి చేరుకుందని అన్నారు.

ఆరుగురు సభ్యులతో రాష్ట్రానికి మేలు జరిగిలే పనిచేస్తామన్నారు. పరిమళ నత్వానికి అనారోగ్యం కారణంగా ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేకపోయారన్నారు. వచ్చేవారం ప్రమాణ స్వీకారం చేస్తారని, ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ కు సమయం కావాలని కోరామని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా కంబంధ హస్తాల్లో విశాఖ - ఆస్పత్రులు కిటకిట