దళితులు, నిమ్న కులస్తులపై మంగళవారం నాడు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన ఓ యువతి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాజాగా క్షమాపణలు కోరారు. రిజర్వేషన్‌ల కారణంగా తక్కువ జాతి వారు తమ తలపై వచ్చి కూర్చుంటున్నారని, అలాగే దళితుల వల్లే తనకు ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదంటూ ఆమె అసభ్యంగా మాట్లాడారు.
తన మిత్రుడితో కలిసి ఎస్సీ, ఎస్టీ, బీసీలను తిడుతూ వీడియో చిత్రీకరించి వాట్సాప్‌లో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది. తీవ్ర విమర్శలు రావడంతో వాళ్లిద్దరూ శుక్రవారం నాడు క్షమాపణలు చెప్పారు.
ఈ మేరకు ఈరోజు మరో వీడియోని విడుదల చేశారు. తాను మాట్లాడిన మాటలకు చింతిస్తున్నానని, ప్రభుత్వ ఉద్యోగం రాలేదనే ఆవేదనతో అలా మాట్లాడానని యువతి చెప్పుకొచ్చారు. దయచేసి తనపై అసభ్యకరమైన కామెంట్‌లు చేయడం ఆపాలంటూ విజ్ఞప్తి చేశారు. ఏ మతాన్ని, కులాన్ని కించపరచడం తమ ఉద్దేశం కాదని ఆ అసభ్యకర వీడియోకి బదులుగా తాజా వీడియోని షేర్ చేయాల్సిందిగా వారు కోరుతున్నారు.