ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించారు. గత రెండున్నరేళ్లలో కొత్త తరహా నేరగాళ్లను చూస్తున్నామన్నారు. ఈ కొత్త నేరగాళ్లు ఎలాంటి పనులు చేస్తున్నారో మనందరం చూస్తున్నామన్నారు.
విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన జగన్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అమరవీరుల పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన భావోద్వేగంతో కూడిన ప్రసంగం చేశారు.
అధికారం దక్కలేదని చీకట్లో రథాలను తగులబెట్టారని మండిపడ్డారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు. అధికారం దక్కలేదని సంక్షేమ పథకాలను అడ్డుకోవడానికి కోర్టుల్లో కేసులు వేస్తున్నారని చెప్పారు. చివరకు పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు కూడా దక్కకుండా చేస్తున్నారని అన్నారు.
అబద్ధాలనే వార్తాపత్రికలకు ఇస్తున్నారని, ఛానళ్లలో అబద్ధాలనే డిబేట్లుగా పెట్టిస్తున్నారని జగన్ మండిపడ్డారు. చివరకు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని కూడా బోసడీకే అని తిట్టారని... బోసడీకే అంటే 'లం.. కొడుకు' అని అర్థమని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి తల్లిని కూడా దుర్భాషలాడుతున్నారన్నారు. ఇదంతా సమంజసమేనా? అనే విషయం గురించి ఆలోచించాలని చెప్పారు. రాజకీయ నాయకుల రూపంలో ఉన్న అసాంఘిక శక్తులను మనం చూస్తున్నామన్నారు. తమకు గిట్టని వ్యక్తి సీఎం అయ్యాడనే అక్కసుతో ఇదంతా చేస్తున్నారని అన్నారు.
ఇప్పటివరకు జరిగిన వివిధ ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు పట్టంకట్టారని... ఇక ఎప్పటికీ అధికారంలోకి రాలేమనే భయంతో ప్రభుత్వంపై అబద్ధాలు చెపుతూ, గోబెల్స్ ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్ర పరువు, ప్రతిష్టలను దిగజార్చుతున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి డ్రగ్స్‌కు బానిస అయ్యాడనే విధంగా కామెంట్లు చేస్తున్నారని చెప్పారు. డ్రగ్స్‌కు ఏపీతో సంబంధం లేదని ఇంటెలిజెన్స్, విజయవాడ సీపీ చెప్పినా... ఒక కుట్ర ప్రకారం బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని సీఎం జగన్ చెప్పుకొచ్చారు.
శాంతిభద్రతలు అనేవి ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైన విషయమని... వీటిని కాపాడే క్రమంలో సీఎం సహా ఎవరినీ ఉపేక్షించాల్సిన అవసరం లేదని జగన్ పోలీసులకు చెప్పారు. శాంతిభద్రతలను కాపాడే క్రమంలో ఏమాత్రం రాజీ పడొద్దని తెలిపారు. చట్టం ముందు అందరూ సమానమేనని... తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెట్టాలని పోలీసులకు వారి విధులను గుర్తు చేస్తున్నట్టు సీఎం జగన్ చెప్పారు.