టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో తమ పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై వైకాపా అల్లరి మూకలు చేసిన దాడులకు నిరసనగా గురువారం నుంచి నిరవధిక నిరసన దీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్ష 36 గంటలపాటు టీడీపీ కేంద్ర కార్యాలయంలో కొనసాగనుంది.
గురువారం రేపు ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు చంద్రబాబు దీక్ష చేస్తారు. పార్టీ కీలక నేతల సమావేశంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు దీక్ష సమయంలో ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలవనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను టీడీపీ నేతలు కలవనున్నారు.
ఇదిలావుంటే, ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు లేఖ రాశారు. పేదరికంతో బాధపడుతున్న వాల్మీకి, బోయ కులాలను షెడ్యూల్డ్ తెగలలో చేర్చాలని ఆ లేఖలో కోరారు. వేట, అటవీ ఉత్పత్తులు సేకరించడమే వాల్మీకి, బోయల జీవనోపాధి అని పేర్కొన్నారు.
ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ కూడా వారిని ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పిందన్నారు. వాల్మీకి, బోయలను భూమిపుత్రులుగా నిర్ధారించి ఎస్టీలుగా గుర్తించాలని పలు నివేదికలు కూడా సిఫారసు చేశాయని లేఖలో పేర్కొన్నారు.
కర్ణాటకలో కూడా వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్చారని చెప్పారు. మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా సానుకూల స్పందన ఆశిస్తున్నామన్నారు.