తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలం కామనగరువు గ్రామంలో రెవెన్యూ అధికారులు గతంలో రికార్డులు తారుమారు చేసి, నకిలీ పత్రాలు సృష్టించి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వద్ద తనఖాపెట్టి భారీగా రుణం పొందిన సంఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.
ఈ సంఘటనకు కారకులైన అమలాపురం రూరల్ మండలం కామనగరువు వీఆర్‌ఓ ప్రశాంతకుమార్‌ను సస్పెండ్ చేస్తూ తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మీడియాలో వచ్చిన కథనాలపై ప్రభుత్వం తక్షణం స్పందించింది.
మీడియలో వచ్చిన కథనాలను రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ స్పందన కాల్ సెంటర్ ద్వారా జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ మురళీధర్ పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. 14.9.2019న ఆర్డీఓ ఇచ్చిన నివేదిక ప్రకారం వెబ్‌ల్యాండ్‌లో కొంతమంది రెవెన్యూ ఉద్యోగులు నకిలీ రికార్డలు సృష్టించినట్లు తేలిందని జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి నివేదించారు.
కామనగరువు గ్రామానికి చెందిన ఎం.చిన్న తాతయ్య తనకు తనకు సర్వే నెంబరు 972/5 లో 20 ఎకరాలు, 924/8లో 33 ఎకరాలు ఉందని నకిలీ పత్రాలు పొందుపరచి హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు నుంచి మోసపూరితంగా రుణం పొందారని, ఇందుకు వెబ్ ల్యాండ్లో నకిలీ రికార్డులు సృష్టించినట్లు, దానికి కొంతమంది అధికారులు సహకరించినట్లు ఆర్డీఓ తన నివేదికలో పేర్కొన్నారు.
దీని ఆధారంగా ఈ సంఘటనలో ప్రమేయమున్న కామనగరువు వీఆర్వో ప్రశాంత్‌కుమార్‌ను తక్షణం సస్పెండ్ చేస్తూ తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ తక్షణం ఆదేశాలు జారీ చేశారు. అలాగే అప్పట్లో అమలాపురం మండలం ఎమ్మార్వో ఇప్పుడు కాకినాడలోని కలెక్టర్ కార్యాలయంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ఈ సంఘటనలో బ్యాంకు అధికారుల ప్రమేయం ఎవరెవరిది ఉన్నది విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా లీడ్ బ్యాంక్ అయిన ఆంధ్రా బ్యాంక్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సంఘటనలో ప్రమేయం ఉన్నవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి పూర్తి చర్యలు తీసుకోవాలని అమలాపురం తహశీల్దార్‌ను కలెక్టర్ ఆదేశించారు.