పంచాయతీ ఎన్నికలలో ప్రజా రాజధాని అమరావతి ఉద్యమస్పూర్తిని రగిలించేవిధంగా ఓటు వేయాలని ఓటర్లకు అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాల కోటయ్య సూచించారు.
ఆటోనగర్ లోని అమరావతి పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 9 నుండి నాలుగు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయని అన్నారు.
అమరావతి ఉద్యమ స్ఫూర్తి రగిలేలా అమరావతి ఉద్యమానికి అండగా నిలబడేలా ఆకుపచ్చ రిబ్బన్ ను ధరించి ఓటు వేటు వేయాలని పిలుపునిచ్చారు. మహిళల ఉద్యమ కన్నీరు సాక్షిగా శాంతియుతంగా అమరావతి ఉద్యమానికి మద్దతు పలుకుతూ రిబ్బన్ ధరించి ముఖ్యమంత్రికి, 151 మంది ఎమ్మెల్యేలకు సందేశం పంపేవిధంగా ఉండాలన్నారు.
రాజధానిగా అమరావతి కావాలని కోరుకుంటున్నా అనేక విదాలుగా ఆందోళనలు నిర్వహించినా ప్రభుత్వానికి మాత్రం చీమకుట్టనట్లుగా లేదని ఆరోపించారు. ఓటు ద్వారా అయినా అమరావతి కావాలని ప్రతి ఒక్కరూ తెలియచెప్పాలన్నారు.
అఖిల భారత హిందూ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు వెలగపూడి గోపాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రాన్ని వెంటిలేటర్ పై పెట్టారని, మహిళలు అమరావతి కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారని అన్నారు. ఇపుడు దళిత సోదరులు అమరావతి ఉద్యమాన్ని భుజాలపై వేసుకున్నారన్నారు.
రానున్న స్థానిక ఎన్నికలలో అమరావతి ఉద్యమ స్ఫూర్తిని రిగిల్చేలా ఆకుపచ్చ వస్త్రం ధరించి ఓటు వేయాలని కోరారు. అమరావతి రాజధాని రైతులను ముంచిన వైసీపీ నాయకులు ఇపుడు విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను కొట్టేందుకు వెళుతున్నారన్నారు.
అమరావతి పరిరక్షణ సమతి కన్వీనర్ ఎ.శివారెడ్డి మాట్లాడుతూ గ్రామాలు ఎలా సురక్షితంగా ఉండాలని కోరుకుంటామో రాష్ట్రం కూడా అలాగే ఉండాలని కోరుకోవాలన్నారు. కాబట్టి అమరావతి ఉద్యమ స్ఫూర్తి తెలిపేలా ఓటు హక్కును ఉపయోగించుకోవాలని కోరారు. దీని ద్వారా ప్రభుత్వం అమరావతిపై పునరాలోచన చేసే అవకాశం ఉంటుందన్నారు.
దళిత జెఎసి అధ్యక్షులు ఎం.మార్టిన్ లూథర్ మాట్లాడుతూ మన ఓటును అమ్ముకోకుండా నిజాయితీకి, అభివృద్ధికి ఓటు వేయాలన్నారు. ఓటు అనే ఆయుధంతో ప్రవేటీకరణ నిలుపుదల చేసేలా, అమరావతి ఉద్యమం స్పూర్తి తెలిసేవిధంగా ఆకుపచ్చ రిబ్బన్ ధరించి ఓటు వేయాలని కోరారు.
దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి మేళం భాగ్యారావు మాట్లాడుతూ 400 రోజులుగా అమరావతి పోరాటం సుదీర్ఘంగా కొనసాగుతుంది. ఈద్యమానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు ఉందన్నారు. పంచాయతీ ఎన్నికలలో ప్రలోభాలకు లొంగి ఓటు వేయవద్దని, ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో పలువురు జెఎసి నాయకులు పాల్గొన్నారు.