సముద్రతీర ప్రాంతమైన విశాఖపట్టణంలో ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. అదీకూడా తనకు చదువు చెప్పే ఓ లెక్చరర్ ఇంట్లోనే ఆ విద్యార్థిని ఈ దారుణానికి ఒడిగట్టింది. సోమవారం రాత్రి జరిగిన ఈ విషాదకర సంఘటన వివరాలను పరిశీలిస్తే,
విశాఖ నాలుగో పట్టణ ప్రాంతానికి చెందిన జ్యోత్స్న అనే విద్యార్థినిని స్థానికంగా ఉండే ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈమెకు ఇదే కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్న అంకుర్‌తో చాలాకాలంగా పరిచయం ఉంది.
ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో అంకుర్ నివశించే ఫ్లాట్‌కు జ్యోత్స్న వచ్చి వెళుతుండేది. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని జ్యోత్స్న ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. దీనికి లెక్చరర్ అంకుర్ నిరాకరించడంతో దిక్కుతోచని జ్యోత్స్న సోమవారం అతని ఫ్లాట్‌లోనే ఫ్యానుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
జ్యోత్స్న ఉరివేసుకున్న విషయాన్ని కూడా నాలుగో పట్టణ పోలీసులకు అంకుర్ వెల్లడించాడు. దీంతో పోలీసులు వచ్చిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. విద్యార్థిని తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తెను అంకుర్ హత్య చేశారని ఆరోపిస్తున్నారు.