ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా మంత్రులపై నిరసన సెగలు ఎక్కువయ్యాయి. వైకాపా నేతల మూడు రాజధానుల పాట పాడుతున్నారు. దీనికి ఒక్క వైకాపా నేతలు మినహా మిగిలిన అన్ని పార్టీల నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం వైకాపా విశాఖలో నిర్వహించిన విశాఖ గర్జన నిర్వహించింది.
ఇందులో పాల్గొని తిరిగి వెళుతున్న మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేశ్‌లతో పాటు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలపై జరిగిన దాడిపై పోలీసు కేసు నమోదు చేశారు. విశాఖ విమానాశ్రయం పరిధిలో జరిగిన ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు పోలీసులే కేసు నమోదు చేశారు.
శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనతో అప్రమత్తమైన విశాఖ పోలీసు కమిషనర్ హుటాహుటీన ఎయిర్ పోర్టు చేరుకున్నారు. దాడికి సంబంధించి రికార్డు అయిన సీసీటీవీ ఫుటేజీని ఆయన పరిశీలించారు. ఈ ఫుటేజీలో నిందితులను గుర్తించిన పోలీసులు... నిందితులపై హత్యాయత్నం కింద కేసులు నమోదు చేశారు.
నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కోన తాతారావు, పీతల మూర్తియాదవ్, విశ్వక్‌సేన్, సుందరపు విజయ్ కుమార్, పంచకర్ల సందీప్, శివప్రసాద్‌రెడ్డి, పీవీఎస్ఎన్ రాజు, శ్రీనివాస్ పట్నాయక్, కీర్తీస్, యశస్విని, గేదెల చైతన్య, పట్టిమ రాజులను అరెస్టు చేశారు.
మంత్రి రోజా, ఇతర వైసీపీ నాయకులు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత అక్కడ వారిపై రాళ్లతోను, జెండా కర్రలతోనూ, పదునైన ఇనుప వస్తువులతోనూ జనసేన నాయకులు వారిని దూషిస్తూ దాడికి పాల్పడినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆస్తులు కూడా ధ్వంసమైనట్టు తెలిపారు.
మరోవైపు, జన సేనాని పవన్ కల్యాణ్ బస చేసిన నోవాటెల్ చుట్టూ పోలీసులు పహారా కాస్తున్నారు. పవన్ బస చేసిన ఫ్లోర్‌లో తనిఖీలు నిర్వహించారు. హోటల్‌లో పవన్‌తోపాటు నాదెండ్ల మనోహర్, నాగబాబు కూడా బస చేశారు. నోవాటెల్ వైపు వచ్చే కార్యకర్తలు, అభిమానులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు.