మాజీ ముఖ్యమంత్రి, మహానేత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చాలా చిన్న విషయమా అని వివేకా కుమార్తె సునీతా రెడ్డి ప్రశ్నించారు. తన తండ్రి వివేకా హత్యను ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి చాలా చిన్నదిగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా, వివేకా హత్య కేసు చాలా వ్యక్తిగతమంటూ సజ్జల చేసిన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు
ముఖ్యమంత్రిగా పని చేసిన రాజశేఖర్ రెడ్డి సోదరుడు, మాజీ ఎంపీ, మాజీ మంత్రి వివేకా హత్యను చిన్నదిగా చూపే ప్రయత్నం చేస్తారా.. ఇది శాంతిభద్రతల విషయం కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకాను పథకం ప్రకారమే హత్య చేశారని.. ఇప్పుడు అధికారాన్ని అడ్డు పెట్టుకుని నిందితులను కాపాడుతున్నారని ఆరోపించారు. రాజన్న కుమార్తె షర్మిలకు మద్దతివ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆమెలో రాజశేఖరరెడ్డి లక్షణాలున్నాయని పేర్కొన్నారు.
మరోవైపు, వివేకా కుమార్తె సునీత తన తండ్రి హత్య కేసులో న్యాయం కోసం పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. ఐదేళ్లుగా కేసులో న్యాయం జరగలేదంటూ కడప జిల్లా ఓటర్లకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులోభాగంగా పులివెందుల వైకాపా నేతలను ఆమె కలిశారు. తన కుటుంబానికి చెందిన శివప్రకాష్ రెడ్డిని వెంటబెట్టుకుని వేంపల్లెలో ఉన్న మాజీ ఎమ్మెల్సీ సతీష్ కుమార్ రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు రవికుమార్ రెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు ఎస్.ఎఫ్.బాషా నివాసాలకు వెళ్లారు. పులివెందుల నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించడంతో పాటు రాజన్న బిడ్డ షర్మిలకు ఓటేయాలని కోరాలని నిర్ణయించారు.