Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైసీపీ పునాదులు మా నాన్న రక్తంతో తడిసివున్నాయి : వివేకా కుమార్తె సునీత

Advertiesment
sunithareddy

ఠాగూర్

, శుక్రవారం, 15 మార్చి 2024 (14:40 IST)
వైసీపీ పార్టీ పునాదులు, దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి రక్తంతో తడిచి ఉన్నాయని, వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెల్లెలు, వైఎస్ వివేకా కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి ఆరోపించారు. వివేకా ఐదో వర్థంతి సందర్భంగా శుక్రవారం కడపలో స్మారక సభ నిర్వహించారు. ఇందులో వైఎస్ సునీత పాల్గొని మాట్లాడుతూ, తన తండ్రి రక్తంతో వైకాపా పార్టీ పునాదులు తడిసివున్నాయన్నారు. తన తండ్రిని హత్చ చేసిన హంతకులపై తాము న్యాయపోరాటం చేస్తుంటే తమపైనే నింద మోపుతారా అని ఆమె ప్రశ్నించారు. హత్యతో తన కుటుంబానికి సంబంధముంటే ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. 
 
వివేకానందరెడ్డి జీవితాంతం వైఎస్ఆర్ కోసమే పనిచేశారని చెప్పారు. ఉమ్మడి కుటుంబానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారన్నారు. ఫ్యాక్షన్, హింసను తగ్గించాలని నిత్యం ఆలోచించేవారని చెప్పారు. "వివేకానంద రెడ్డి మనకి దూరమై ఐదేళ్లు అయింది. ఆయనకు అంత కీడు ఎలా తలపెట్టారని ఆలోచిస్తున్నప్పుడే జగనన్న సీఎం అయ్యారు. ప్రజలందరికీ న్యాయం చేస్తానని ఆయన ప్రమాణస్వీకారం చేశారు. అది చూసి మనమంతా గర్వపడ్డాం. జగనన్నను ఒక ప్రశ్న అడుగుతున్నా.. అంతఃకరణశుద్ధిగా అంటే అర్థం తెలుసా? వివేకాను చంపిన వారికి, చంపించిన వారికి శిక్ష పడేలా చేయాల్సిన బాధ్యత మీకు ఉంది. ఇప్పటివరకూ హంతకులకు శిక్షపడేలా ఎందుకు చేయలేదు? మీ ప్రమాణాన్ని ఎందుకు నిలబెట్టుకోలేదు.? మేం ఈ నేరం చేశామని చెప్పడం మీకు ఎబ్బెట్టుగా లేదా? ప్రభుత్వంలో ఉండి.. మాపై ఆరోపణలు చేయడమేంటి? హంతకులను పట్టిస్తే రూ.5 లక్షలు ఇస్తామని సీబీఐ ప్రకటించింది. జగనన్నా.. మమ్మల్ని పట్టించి ఆ బహుమతి అందుకోండి.
 
అలాగే, జగన్ సతీమణి వైఎస్ భారతీ రెడ్డికి కూడా సునీత ప్రశ్నలు సంధించారు. పదేపదే మాపై ఆరోపణలు చేయడానికి మీకు సిగ్గుగా లేదా? సాక్షి పత్రికలో మాపై నిందలు వేస్తూ వార్తలు రాస్తున్నారు. సాక్షి చైర్ పర్సన్ భారతికి ఓ విన్నపం.. మీ వద్ద ఆధారాలుంటే సీబీఐకి ఇవ్వండి. ఆధారాలు ఉండీ పోలీసులకు ఇవ్వకపోవడం నేరం. అన్నం పెట్టిన చేతిని నరకడం.. వ్యక్తిత్వం మీద బురద జల్లడం దారుణం. మాపై నిందలు వేసినా.. సీతాదేవిలా నిర్దోషిత్వం నిరూపించుకుంటాం. మీ కోసం నిరంతరం పని చేసిన వివేకాను మర్చిపోయారా? 
 
తండ్రిపోయిన బాధలో తల్లడిల్లుతున్న కుమార్తె ఒకవైపు ఉన్నారు.. చంపినవాళ్లు, చంపించినవాళ్లు, వాళ్లను కాపాడుతున్న వాళ్లు మరోవైపు ఉన్నారు. ప్రజలారా.. మీరు ఎటువైపు ఉంటారు? దిగ్భ్రాంతిలో ఉండిపోతారా? మీకు స్పందించే అవకాశం వచ్చింది.. స్పందించండి. వైకాపా పునాదులు వివేకా, కోడికత్తి శ్రీను రక్తంలో ఉన్నాయి. ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మీ భవిష్యత్ కోసం బయటకు రండి. రాకపోతే ఆ పాపం మీకు చుట్టుకుంటుంది' అని సునీత వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్నా అని పిలుచుకునేవారే హంతకులకు కొమ్ము కాస్తున్నారు : వైఎస్ షర్మిల