Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అవినాష్ రెడ్డి ఏమైనా పాలుతాగే బిడ్డనా? వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

ys sharmila

వరుణ్

, సోమవారం, 8 ఏప్రియల్ 2024 (07:46 IST)
తన చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తన ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా, కడప లోక్‌సభ టిక్కెట్‌ను వైఎస్ అవినాష్ రెడ్డికి తన అన్న, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఇవ్వడాన్ని ఆమె ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా, వివేకా హత్య కేసులోని ప్రధాన నిందితుల్లో అవినాష్ ఒకరని సీబీఐ వెల్లడించింది. అలాంటి అవినాష్‌ను జగన్ పక్కనబెట్టుకుని తిరగడాన్ని ఆమె ఏమాత్రం సహించలేక పోతుంది. అందుకే వివేకా హత్య కేసులో హంతకుడు వైఎస్ అవినాష్ రెడ్డి అంటూ ఆమె బహిరంగంగానే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా ఆమె తన ప్రచారంలో ఈ అంశాన్ని మరోమారు ప్రధానాంశంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. 
 
వివేకా హత్య ఘటనకు సంబంధించి తన మేనమామ, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి.. ఎంపీ అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకుని ఎర్రగంగి రెడ్డి అంతా చేశాడనే విధంగా మాట్లాడటాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. హత్య అనంతరం ఎర్రగంగిరెడ్డి సాక్ష్యాధారాలను తారుమారు చేస్తుంటే అవినాష్ రెడ్డి అంత అమాయకంగా చూడటానికి ఆయన ఏమైనా పాలుతాగే బిడ్డా అంటూ ప్రశ్నించారు. ఎంపీగా ఉన్న వ్యక్తికి ఆ మాత్రం తెలియదా అంటూ ఎద్దేవా చేశారు. 
 
తాను చేపట్టిన బస్సుయాత్రలో భాగంగా మూడో రోజు ఆదివారం కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో వివేకా కుమార్తె సునీతతో కలిసి పలు సభల్లో షర్మిల ప్రసంగించారు. తాను తెలంగాణ నుంచి ఇక్కడకు వచ్చానంటూ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి చేస్తున్న విమర్శలపై ఆమె స్పందించారు. అక్కడ నియంత కేసీఆర్‌ను ఓడించానని.. ఏపీలోనూ జగన్‌ను ఇంటికి పంపడానికి వచ్చానని చురకలు అంటించారు. ఈ అంశంపై ఆయనకున్న అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. 
 
స్వప్రయోజనాల కోసం జగన్ రెడ్డి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశారని, మరోసారి అధికారం చేతికిస్తే జనాన్ని సైతం తాకట్టు పెట్టేస్తారని హెచ్చరించారు. కడప ఉక్కు పరిశ్రమను శంకుస్థాపన ప్రాజెక్టుగా జగన్ మార్చేశారని ఎద్దేవా చేశారు. కడప ఉక్కు పరిశ్రమ పూర్తయి ఉంటే వేల మందికి ఉద్యోగాలొచ్చేవని పేర్కొన్నారు. రైతుల కోసం స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్న జగన్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారా, వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లారా అని ప్రశ్నించారు. మెగా డీఎస్సీ ప్రకటిస్తానన్న సీఎం.. దగా డీఎస్సీ వేశారని విమర్శించారు. 
 
రాష్ట్రంలో ఒక్క వర్గాన్నయినా పట్టించుకున్నారా అంటూ విమర్శలు గుప్పించారు. నాసిరకం మద్యాన్ని విక్రయిస్తూ 20 శాతం జనాభాను అనారోగ్యం పాళేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హంతకులు చట్టసభలకు వెళ్లరాదనే నిర్ణయంతోనే కడప నుంచి పోటీ చేస్తున్నానని వివరించారు. మాట ఇస్తే తప్పడం వైఎస్సార్ జీవితంలో లేదని, జగన్ మాత్రం మాట తప్పడాన్నే అలవాటుగా చేసుకున్నారని విమర్శించారు. ధర్మం, న్యాయం కోసమే ప్రజల ముందుకు తానొచ్చానని షర్మిల స్పష్టం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలెక్సాను కుక్కలా మొరగాలని ఆదేశించిన బాలిక... బంపర్ ఆఫర్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా!!