ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వినాయక చవితి వేడుకలపై ఆంక్షలు విధించింది. వైకాపా నేతల ర్యాలీలకు, ఇతర మతస్తుల పండుగలకు ఎలాంటి ఆంక్షలు విధించని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి.. ఇపుడు హిందువుల పవిత్ర పండుగల్లో ఒకటైన వినాయకచవితి ఉత్సవాలపై ఆంక్షలు విధించడం ఇపుడు సర్వత్రా చర్చనీయాంశంతోపాటు వివాదాస్పదమైంది.
దీనిపై ఏపీకి చెందిన బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ నేతలు నిర్వహించే కార్యక్రమాలకు వేలాది మంది తరలివస్తే రాని కరోనా.. ప్రజలు వినాయక చవితి చేసుకుంటే మాత్రం వస్తుందా? అంటూ ఆయన నిలదీశారు.
'ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు.. మీ కాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు వేల మందితో జగనన్న అద్దాల మహల్ ప్రారంభోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తే కరోనా రాదా సార్?' అని ఆయన నిలదీశారు.
'20 మంది హిందూ యువకులు వీధిలో వినాయకుడిని పూజిస్తే మాత్రమే వస్తుందా? మీ వాళ్లు ఏమైనా కరోనా రహిత కార్యకర్తలా?' అని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తల ర్యాలీకి సంబంధించిన వీడియోను ఆయన పోస్ట్ చేశారు. కాగా, ఇప్పటికే ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ నేతలు కలిసి ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.