ఏపీలో రోడ్ల దుస్థితిపై జనసేన చెప్తేగానీ కళ్లు తెరవరా..? అని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఇకనైనా ఆలస్యం చేయకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని పవన్ సీఎంకు సూచించారు. రాష్ట్రంలో రహదారులు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో జనసేన నాయకులు, శ్రేణులు ఏకబిగిన సామాజిక మాధ్యమాల్లో వెల్లడిస్తేనే వైసీపీ ప్రభుత్వం కళ్ళు తెరచి రోడ్ల మరమ్మతులు, నిర్మాణంపై ఆలోచన మొదలుపెట్టిందన్నారు పవన్.
లక్షల మంది రహదారి కష్టాలను చెప్పారు. వర్షాలు తగ్గాక అక్టోబర్ తరవాత రోడ్డు మరమ్మతుల ప్రక్రియ మొదలుపెడతామని వైసీపీ ప్రభుత్వం చెప్పిందని వెల్లడించారు. అప్పుడు టెండర్లు పిలిచి, కాంట్రాక్టర్లను నిర్ణయించి పనులు మొదలుపెట్టాలంటే సంక్రాంతి వస్తుందని..,ఇక పనులెప్పుడు పూర్తవుతాయని పవన్ ప్రశ్నించారు.
ప్రభుత్వం పనులు ప్రారంభించేవరకూ ప్రజలకు ఈ గోతుల రోడ్లే గతి కావచ్చని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకూ రోడ్లపై ఈ ప్రభుత్వానికి ఎలాంటి దృష్టి లేదన్న జనసేనాని... నిజంగా శ్రద్ధ ఉంటే వర్షాకాలం ముగిసిన వెంటనే పనులు మొదలయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసేవారన్నారు.
కాగా... రాష్ట్రంలో రోడ్ల దుస్థితిని ప్రజలు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు జనసేన పార్టీ #JSPForAP_Roads హ్యాష్ ట్యాగ్ పైరుతో సోషల్ మీడియా ఉద్యమం చేపట్టిన సంగతి తెలిసిందే. లక్షలాది మంది ప్రజలు ఉద్యమంలో పాల్గొని రోడ్లకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితిని తెలియజేస్తూ 6 లక్షల 20వేల మంది ట్వీట్లు చేయగా.. సోషల్ మీడియా ద్వారా దాదాపు రెండున్నర కోట్ల ప్రజల ముందుకు ఈ సమస్యను తీసుకెళ్లామని పవన్ కల్యాణ్ తెలిపారు.