చెడ్డీ గ్యాంగ్ మొన్న వచ్చింది... విజయవాడ పరిసర ప్రాంతాలలో అందరినీ హడలెత్తించింది. దీనిపై ప్రత్యేక దృష్టిని పెట్టిన విజయవాడ కొత్త సీపీ క్రాంతి రాణా టాటా, చెడ్డీ గ్యాంగ్ సభ్యులు ఇద్దరిని వలపన్ని పట్టుకున్నారు. కానీ, బెజవాడ ప్రజలను ఎప్పటి నుంచో వేధిస్తున్న బ్లేడ్ బ్యాచ్ పై ఇపుడు సీపీ క్రాంతి రాణా దృష్టి సారించారు. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం అని ప్రకటించారు.
బెజవాడ సీపీ క్రాంతి రానా, న్యూ ఇయర్ రాక సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల బెజవాడలో కత్తులతో బెదిరించిన ఇద్దరిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. అలాగే, ఇక్కడ దొంగతనాలు చేసిన చెడ్డీ గ్యాంగ్ కోసం దాహాద్ కి పోలీసు బృందాలను పంపామని తెలిపారు. చెడ్డీ గ్యాంగ్ మిగతా సభ్యులను కూడా పట్టుకుంటామన్నారు.
ఇక విజయవాడలో గత ఏడాది కంటే 15 శాతం ఎక్కువ కేసులు నమోదు అయ్యాయని, అలాగే, ఎక్కువ కేసులను ఛేదించి, సొత్తు రికవరీ కూడా చేశామని తెలిపారు. సైబర్ క్రైం కేసులు గత ఏడాది 160 నమోదు కాగా, ఈ ఏడాది 126 కేసులు నమోదు అయ్యాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండటం వల్ల సైబర్ నేరాలు తగ్గాయని చెప్పారు.
కోవిడ్ థర్డ్ వేవ్ వస్తున్న సంకేతాల నేపద్యంలో కోవిడ్ నిబంధనలు పాటించాలని, కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేస్తామని సీపీ హెచ్చరించారు. విజయవాడలో కొత్తగా 40 మందిపై రౌడీ షీట్లు తెరిచామని, సస్పెక్ట్ షీట్లు 238 మందిపై తెరిచామని తెలిపారు. రౌడీల కదలికలపై నిఘా కొనసాగుతుందన్నారు. గత ఏడాది దుర్గమ్మ వెండి సింహాలు చోరీ, వృద్ధుల హత్యల ముఠాలను పట్టుకున్నామని వివరించారు. నగరంలో ట్రాఫిక్ పోలీసింగ్ ను మెరుగుపరుస్తామని తెలిపారు.