Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెడ్డీ గ్యాంగ్ లో ముగ్గురి అరెస్ట్... విజ‌య‌వాడ సీపీ రాణా భేష్‌!

చెడ్డీ గ్యాంగ్ లో ముగ్గురి అరెస్ట్... విజ‌య‌వాడ సీపీ రాణా భేష్‌!
విజ‌య‌వాడ‌ , శనివారం, 18 డిశెంబరు 2021 (12:16 IST)
విజయవాడ నగర ప్రజలను బయబ్రాంతులకు గురి చేసి వివిధ నేరాలకు పాల్పడిన గుజరాత్ కు చెందిన చెడ్డీ గ్యాంగ్ సభ్యులలో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. ఈ మధ్య కాలంలో నగర శివారు ప్రాంతాలలో జరిగిన దొంగతనాలు పై ప్రత్యేక దృష్టి సారించిన నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఆదేశాల మేరకు దొంగతనాల నియంత్రణ నిమిత్తం పోలీసు గస్తీని ముమ్మరం చేశారు. పాత నేరగాళ్ళు, జైలు నుండి విడుదలైన వారు, అనుమానాస్పద వ్యక్తులు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నేరగాళ్ళ‌పై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. 

 
విజయవాడ టూటౌన్, ఇబ్రహీంపట్నం,పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలలో దొంగతనం జరిగినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు విజయవడ నగర పోలీస్ కమీషనర్ ఆధ్వర్యంలో లా అండ్ ఆర్డర్ పోలీస్ సిబ్బందితో ఏర్పాటు చేసి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఘటనా స్థలాలకి చేరుకొని నేరం జరిగిన తీరు, క్లూస్ టీమ్ ద్వారా సేకరించిన ఆధారాలు, సి.సి. కెమెరాల ఆధారంగా అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తూ, ముద్దాయిల గురించి గాలించారు. టూటౌన్ ఇన్ స్పెక్టర్ మోహన్ రెడ్డి,పెనమలూరు ఇన్ స్పెక్టర్ సత్యనారాయణ, సి.సి.ఎస్. సిబ్బందితో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి 3 కేసులలో ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. 
 
 
నిందితుల‌లో మడియా కాంజీ మేడా, గుజ‌రాత్ లోని గుల్చర్, సక్ర మండోడ్, గుల్బర్ వాసి, కమలేష్ బాబేరియాల‌ను ప‌ట్టుకున్నారు. నిందితులు గుల్ఫర్ గ్రామం గార్బార్డ్ తాలూకా, దాహూద్ జిల్లా, గుజరాత్ రాష్ట్రంకు చెందిన వారు. వీరు నేరానికి వచ్చేటప్పుడు నిక్కరు దరిస్తారు. వీరు కూలి పనులు చేసుకుంటూ ఉంటారు. కూలి పనులు లేని సమయంలో డబ్బుల కోసం రైళ్ళలో ప్రయాణ చేసి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ నగర శివారు నిర్మానుష్య ప్రదేశాలలో ఉండే ఇళ్ళు, అపార్ట్ మెంట్ లను గ‌మ‌నిస్తారు. పగటి సమయంలో రెక్కి నిర్వహించి రాత్రి సమయంలో వెళ్లి ఇంటి తాళాలు పగులకొట్టి ఇళ్ళల్లో ఉన్న నగదు, బంగారం ఇతర విలువైన వస్తువులను దొంగిలించుకొని వెళుతూ ఉంటారు. 
 
 
గత నవంబర్ నెలలో గుజరాత్ రాష్ట్రం నుండి రైలులో బయలుదేరి విజయవాడ నగర శివారులోని మిల్క్ ప్రాజెక్టు వద్ద గల ఫ్లైవోవర్ బ్రిడ్జి పక్కన ఉన్న అపార్ట్ మెంట్ ను గమనించి ఆ అపార్ట్ మెంట్ చుట్టూ ఖాళీ ప్రదేశం ఉండడంవల్ల దొంగతనం చేయడానికి అనువైనదిగా ఎంచుకొని చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను పరిశీలించుకుని దొంగతనం చేయాలని నిర్ధారించుకున్నారు. అదే రోజు రాత్రి సుమారు 9 గంటల సమయంలో ముందుగా వారు రెక్కీ చేసిన అపార్ట్ మెంట్ సమీపంలో వీరు దొంగతనం చేసేటప్పుడు ఎవరైనా ఎదురు తిరిగితే వారిపై దాడి చేయడానికి అనువుగా ఒక ఇనుప రాడ్డు, పెద్ద పెద్ద కర్రలు తీసుకొని సిద్ధ‌మ‌య్యారు.


ఆ అపార్ట్ మెంట్ దగ్గరలో నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి వెళ్ళి అక్కడ సమయంలో కోసం ఎదురు చూస్తూ, ఉండి రాత్రి సుమారు 2.00 గంటల సమయంలో కేవలం బన్నీలు, చెడ్డీలు వేసుకొని ముఖాలకు, నడుముకు టవళ్ళు కట్టుకొని అపార్ట్ మెంట్ వెనక నుండి లోపలికి ప్రవేశించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న వాచ్ మెన్ ని మారణాయుధాలతో బెదిరించి, వారు తెచ్చిన మారణాయుధాలతో తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్ళి బీరువా తెరిచి అందులో ఉన్న బంగారు వస్తువులు, డబ్బులను దొంగతనం చేసి తిరిగి వారి స్థావరాలకు వెళ్ళిపోయారు.
 
 
అదే విధంగా డిసెంబ‌రు 1న ఇబ్రహీంపట్నంలోని గుంటుపల్లి గ్రామంలో నిర్మానుష్య ప్రదేశంలో గల అపార్ట్ మెంట్ లను రెక్కీ నిర్వహించుకొని అదే రోజు రాత్రి 7 గంటల సమయంలో మారణాయుధాలతో నిర్మానుష్యమైన ప్రదేశానికి చేరుకొని సమయం కోసం ఎదురు చూసి రాత్రి 2 గంటల సమయంలో  బన్నీలు చెడ్డీలు వేసుకొని నడుముకు టవళ్ళు కట్టుకొని ఎవరికీ కనబడకుండా అపార్ట్ మెంట్ లోకి వెళ్ళారు. అక్కడ వారు తెచ్చుకున్న మారణాయుధాలతో ఇంటి తలుపులు పగలగొడుతూ ఉండగా, ఆ శబ్దానికి ఆ ఇంటిలోని వారు, చుట్టు ప్రక్కల వారు లేవ‌డంతో అక్కడి నుండి పారిపోయారు.
 
 
మరలా డిసెంబ‌రు 2న గుంటూరు జిల్లా, తాడేపల్లి వెళ్ళి ఆ ఏరియాలో దొంగతనం చేయడానికి వీలుగా ఉంటుందని అనుకొని తాళాలు వేసిన ఇళ్ళను రెక్కీ నిర్వహించారు. రాత్రి సుమారు 10.00 గంటల సమయంలో దొంగతనం చేయడానికి తాడేపల్లిలో ఉన్న రైన్ బో విల్లాస్ ఉన్న కాలనీ వెనుక ఉన్న అరటి తోటలోకి వెళ్ళి ఎవరికి కనబడకుండా కూర్చొని సమయం కోసం ఎదురుచూసి రాత్రి సుమారు 1.00 గంటల సమయంలో దోపిడీకి బ‌య‌లుదేరారు. చెడ్డీల‌తో, వారు తెచ్చుకున్న మారణాయుధాలతో కాలనీ వెనుక నుండి లోపలికి ప్రవేశించి అక్కడ తాళం వేసి ఉన్న 3 ఇళ్ళను పగలకొట్టి దొంగతనం చేయడానికి ప్రయత్నించారు. కానీ అక్కడ ఎటువంటి బంగారం ఆభరణాలు గాని, నగదు గాని దొరకకపోవడంతో తిరిగి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి, తెల్లవారితే 4వ తేదీన ఆ విల్లాస్ కి దగ్గరగా ఉన్న కుంచనపల్లి గ్రామంలో ఒక అపార్ట్ మెంట్ లో తాళాలు పగులగొట్టి నగదు, ఇతర ఆభరణాలు దొంగిలించారు.
 
 
పోరంకి కాలనీలో రెక్కీ నిర్వహించుకొని ది. డిసంబ‌రు 6 రాత్రి సుమారు 8 గంటల సమయంలో నిడమానూరు వైపు వెళ్లే రోడ్డులో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి ఆ బిల్డింగ్ వెనక ఉన్న పోలాలలో ఎవరికీ కనబడకుండా కూర్చోన్నారు. రాత్రి సుమారు 2 గంటల సమయంలో బట్టలు మార్చుకుని వారు తెచ్చుకున్న మారణాయుధాలతో విల్లాస్ ఉన్న కాలనీలోకి గోడదూకి కాలనీలోకి వెళ్ళి తాళం వేసి ఉన్న ఇంటిని పగలగొట్టి ఆ ఇంట్లో ఉన్న బంగారపు వస్తువులు, వెండి వస్తువులు. డబ్బులు దొంగిలించుకుని వెళ్ళారు. పోలీసులు వారి నుంచి రూ. 20,000/-లు నగదు, 32 గ్రాముల బంగారం, 2.5 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు.
 
 
పై కేసులలో దర్యాప్తులో భాగంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేయడంలో చురుగ్గా వ్యవహరించి విధి నిర్వహణలో ప్రతిభ చూపిన పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని విజయవాడ నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా అభినందించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గచ్చిబౌలి రోడ్డు ప్రమాదం: జూనియర్ ఆర్టిస్టులు సహా ముగ్గురు మృతి