Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విజయవాడలో ఉద్రిక్తత .. చంద్రబాబు అరెస్టు... బంగాళాఖాతంలో కలిపేవారు...

విజయవాడలో ఉద్రిక్తత .. చంద్రబాబు అరెస్టు... బంగాళాఖాతంలో కలిపేవారు...
, బుధవారం, 8 జనవరి 2020 (21:05 IST)
రాజధాని అమరావతి తరలింపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాజధాని ప్రాంత రైతులు గత 23 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వీరికి ఒక్క వైకాపా మినహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రైతులతో కలిసి పోరాటం చేస్తోంది. 
 
ఈ క్రమంలో విజయవాడ బెంజి సర్కిల్‌లో అమరావతి పరిరక్షణ సమితి కార్యాలయాన్ని బుధవారం రాత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఆ తర్వాత జేఏసీ నేతలు పాదయాత్ర నిర్వహించాలని భావించారు. కానీ, పోలీసులు ఈ పాదయాత్రను అడ్డుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబుతో సహా నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వర రావులతోపాటు.. జేఏసీ నేతలను అరెస్టు చేసి పోలీసు వాహనంలో తరలించారు. 
 
అంతకుముదు చంద్రబాబు మాట్లాడుతూ, రాజధానికి విజయవాడ సరైన ప్రాంతమని గతంలో వైఎస్. జగన్మోహన్ రెడ్డి అన్నాడు... ఇపుడు జగన్ ఎందుకు యూటర్న్ తీసుకున్నారు అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.  
 
అంతేకాకుండా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మారితే రాజధాని మారిపోతుందా? అన్ని రాష్ట్రాల్లో ఇలాగే రాజధానులు మారిస్తే పరిస్థితి ఎలా ఉండేది? కేసులు పెడతారని ప్రజలు భయపడుతున్నారు. లేకుంటే ఈ ప్రభుత్వాన్ని ఎపుడో బంగాళాఖాతంలో కలిపేవారని అన్నారు. 
 
అసలు మూడు రాజధానులు చేయాలని జగన్మోహన్ రెడ్డిని ఎవరు అడిగారు? అంటూ ఆయన నిలదీశారు. పైగా, రాజధాని ప్రాంతంలో ఒకే కులంవారున్నారంటూ అసత్య ప్రచారం చేస్తూ, కులాల మధ్య చిచ్చు పెట్టి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధిపొందాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు.
 
రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల ఇప్పటికే అనేక కంపెనీలు వెనక్కి వెళ్లిపోయాయనీ, భవిష్యత్‌లో కూడా ఏ ఒక్క కంపెనీ కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇపుడున్న పరిస్థితుల్లో అమరావతికి ఒక్క పైసా కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న భవనాల్లోనే పాలన కొనసాగించండి అని సలహా ఇచ్చారు. 
 
మీరు ఏమీ చేయలేరు.. మేం వచ్చాక అమరావతిని పూర్తిచేస్తాం. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగితే సిట్టింగ్‌ జడ్జీతో విచారణ జరిపించండి. 5 కోట్ల మంది ఒప్పుకుంటే రాజధానిని ఎక్కడైనా పెట్టుకోండి. రాజధాని రెఫరెండంతో ఎన్నికలకు వెళ్లాలి. అమరావతి.. రైతుల సమస్య మాత్రమే కాదు.. రాష్ట్ర ప్రజలందరిదీ. రాజధాని మారిస్తే మీ పతనం ప్రారంభమైనట్లేనని చంద్రబాబు జోస్యం చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పేదల కడుపులో సున్నం కొడుతున్నారు... జగనన్న వదిలిన బాణం ఎక్కడ?