ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయో బేధం లేకుండా మహిళలపై కామాంధులు విరుచుకుపడుతున్నారు. కానీ తాజాగా ఘోరం జరిగింది. ఓ మహిళపై 39మంది అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మహిళ తనపై 39 మంది అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే.. బాధితురాలు పోలీసులకు చేసిన ఫిర్యాదులో తనపై గ్రామానికి చెందిన చమన్, అమిత్, శంభు, పుష్పేంద్ర అనే నలుగురు తనను అత్యాచారం చేసి సెల్‌ఫోన్లో వీడియోలు తీశారని, వాటితో బెదిరిస్తూ మరో 35 మందితో అత్యాచారం చేయించారని ఫిర్యాదులో పేర్కొంది. నిందితుల్లో ఒకరైన అమిత్ తన ఇంట్లో రూ.50వేల నగదు దొంగతనం చేశాడని మరో ఫిర్యాదు చేసింది.
బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు 39 మందిపై రేప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే గ్రామస్థులు మాత్రం సదరు మహిళ తమపై తప్పుడు సమాచారం ఇచ్చిందని వాపోతున్నారు. ఆమె భర్త తమ దగ్గర తీసుకున్న అప్పు తిరిగివ్వాలని కోరుతున్నందునే తమపై తప్పుడు కేసులు పెట్టారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆ మహిళ భర్త ఇటీవల మద్యానికి బానిసై గ్రామంలో చాలామంది దగ్గర సుమారు రూ.రెండున్నర లక్షల అప్పులు చేశాడు. దీంతో రుణదాతలందరూ అప్పు తీర్చాలంటూ వేధించడంతో వారిపై తప్పుడు కేసులు పెడుతున్నట్లు తెలిపారు. తమను ఇబ్బంది పెట్టాలని ఉద్దేశపూర్వకంగా ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసులు ఎలా నమోదు చేస్తారని గ్రామస్థులు నిలదీస్తున్నారు.
తమకు న్యాయం చేసి తప్పుడు ఫిర్యాదు ఇచ్చిన దంపతులపై కఠినచర్యలు తీసుకోవాలని గ్రామస్థులు ఎస్పీని కోరారు. దీనిపై స్పందించిన ఆయన దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించామని, నిజానిజాలు నిగ్గు తేలేవరకు నిందితులెవరినీ అరెస్ట్ చేయబోమని హామీ ఇవ్వడంతో గ్రామస్థులు శాంతించారు.