Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమల తిరుపతి కార్మికులతో కలిసి స్వామీజి గోవింద నామస్మరణ

Advertiesment
vijaya sankar swamiji
విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 10 డిశెంబరు 2021 (10:56 IST)
కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీవారి భక్తులను భాధించవద్దని, వారి న్యాయమైన కోర్కెలను టిటిడి ఉన్నతాధికారులు  పరిష్కరించాలని సనాతన ధర్మ ప్రచార పరిషత్ విజయవాడ వ్యవస్థాపకులు విజయ శంకర స్వామి అన్నారు. 


తిరుమల తిరుపతి దేవస్థానం  పరిపాలనా భవనం వద్ద గత 13 రోజులుగా నిరసన దీక్షలు చేపట్టిన కార్మికులను ఉద్దేశించి స్వామీజీ ప్రసంగించారు. 13 రోజులుగా రేయి, పగలు, చలి, వాన లను సైతం లక్ష్యపెట్టకుండా 'గోవింద' నామస్మరణ చేస్తూ, వేలాది మంది పాల్గొన్న తీరును చూసి తాను చలించిపోయానని, తనకున్న  కార్యక్రమాలు రద్దు చేసుకొని, తిరుమల శ్రీవారి భక్తుల వద్దకు చేరుకున్నానని వివరించారు. కార్మికుల కోర్కెలను వింటే ఇంతటి స్వల్పమైన కోర్కెల కోసం టిటిడి యాజమాన్యం ఇంతలా బాధించాలా? అని  విస్తుపోయానని అన్నారు. స్వామివారి ముందు అందరూ సమానులేనని కాంట్రాక్టు కార్మికులు, శాశ్వత ఉద్యోగులు, అధికారులు అన్న పేర్లు మనం పెట్టుకున్నవేనని... స్వామివారికి భక్తులంతా సమానమేనని... ఈ విషయాన్ని టీటీడీ యాజమాన్యం సరిగా అర్థం చేసుకోకపోతే పరిణామాలు ఇలానే ఉంటాయని టిటిడి యాజమాన్యానికి చురకలంటించారు.


తిరుమల శ్రీవారు భక్తుల బాధలను గమనిస్తారని, శాశ్వత పరిష్కారం లభిస్తుందని, భక్తి భావంతో శాంతియుతంగా సాగిస్తున్న ఉద్యమం విజయవంతమవుతుందని ఆకాంక్షించారు. కాంట్రాక్ట్ కార్మికులచే గోవింద నామస్మరణ చేయిస్తూ, సనాతన ధర్మ విలువల గురించి ప్రబోధించారు. తిరుమల శ్రీవారి వద్ద పనిచేసే కార్మికులపై   స్వామీజీలకు సానుభూతి ఉందని ఆయన అన్నారు. ధర్మం ఇబ్బందికి గురి అయినపుడు ఆ ధర్మాన్ని రక్షించుకునేందుకు మనుషుల రూపంలో దేవుడు వస్తారని,  ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.  ఉద్యమాన్ని సరైన పంథాలో నడిపించడం ద్వారా విజయం సాధిస్తారని ఆయన అభిలషించారు. సమస్య పరిష్కారానికి సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు చేస్తున్న ఆందోళన ప్రశంసనీయమైనదని, అనేక మంది రెచ్చగొడుతున్నా రెచ్చి పోకుండా అత్యంత క్రమశిక్షణతో వేలాది మంది కార్మికులు రేయి... పగలు తేడా లేకుండా నడి రోడ్డుపై స్వామి వారి కీర్తనలు ఆలపిస్తూ, తమ సమస్యలు చెప్పుకునేందుకు చేస్తున్న ఈ ప్రయత్నం నభూతో నభవిష్యతి అని అన్నారు.


టీటీడీ ఈవో జవహర్ రెడ్డి, ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డిలు స్పందించి తిరుమల తిరుపతి దేవస్థానంలో  కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలని కోరారు. టీటీడీ లాంటి ధార్మిక క్షేత్రంలో కాంట్రాక్టు వ్యవస్థ సమర్ధనీయం కాదని సూచించారు. కార్మికులకు రావలసిన ఆర్ధిక ప్రయోజనాలను మధ్యలోని దళారీలు దోచేస్తున్నారని, తిరుమల శ్రీవారి సొమ్ము అప్పనంగా మింగేయడం అన్యాయమని చెప్పారు. కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి, కాంట్రాక్టర్లకు ఇచ్చే కమీషన్ల తో సహా ఆర్ధిక ప్రయోజనాలన్నింటిని కార్మికులకు అందించాలని, సమస్యల పరిష్కారానికి సరైన చర్యలు చేపట్టాలని స్వామీజీ టిటిడి యాజమాన్యానికి సూచించారు. వందలాది మంది మహిళలు, కార్మికులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి టీటీడీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి టి సుబ్రమణ్యం అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో పలువురు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రిగేడియల్ లిద్దర్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన రాజ్‌నాథ్