వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విజయసాయిరెడ్డికి మరో కీలక పదవి లభించింది. వైకాపాకు రాజ్యసభలో బలం పెరగడంతో.. కీలకమైన బీఏసీలో చోటు లభించింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించింది వైసీపీ. దీంతో సభలో బిజినెస్ అడ్వైజరీ కమిటీలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి చోటు దక్కింది.
రాజ్యసభ కార్యక్రమాల నిర్వహణలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ కీలకపాత్ర పోషిస్తుంది. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో.. వైసీపీ నుంచి కొత్తగా నలుగురు సభ్యులు ఎన్నికయ్యారు. దీంతో.. రాజ్యసభలో వైసీపీ బలం రెండు నుంచి ఆరుకు పెరిగింది. ప్రస్తుతం.. విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానిలు వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు.
బీసీఏ సభ్యులుగా ప్రొఫెసర్ మనోజ్ కుమార్ ఝా, మల్లికార్జున్ ఖర్గే, శివ్ ప్రతాప్ శుక్లాలను నామినేట్ చేశారు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు. ఇక, సబార్డినేట్ లెజిస్లేచర్ కమిటీ సభ్యులుగా జీవీఎల్ నరసింహారావు, కె.ఆర్.సురేష్‌రెడ్డి నియమితులయ్యారు.