వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోమారు ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్‌పై విమర్శలు గుప్పించారు. నారా లోకేశ్‌ను తిండిబోతుగా అభివర్ణించారు. ఇదే అంశంపై ఆయన తన ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు.
'కరోనా నియంత్రణతో పాటు ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందన్నారు. 108,104 అంబులెన్సులు ప్రాణం పోసుకున్నాయి. ప్రభుత్వ హాస్పిటళ్లు కార్పొరేట్ సంస్థలతో పోటీ పడేలా ఉండాలని సీఎం జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ మార్పు ఇప్పటికే కనిపించగా, మరో రెండేళ్ళలో పూర్తిగా కనిపించనుంది.
పాలన ఎప్పుడు 'సిటిజెన్ సెంట్రిక్'గా ఉండాలని పొలిటికల్ సైన్స్ గ్రంథాలు చెబ్తాయి. దీనిపై ఇప్పటికీ అనేక అధ్యయనాలు జరుగుతున్నాయి. ప్రజా సంక్షేమం, పారదర్శకత, బాధ్యత, తక్షణ స్పందన ఉండాలనేదే వీటి సారాంశం. జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఇవన్నీ హర్షణీయ స్థాయిలో అమలవుతున్నాయి' అంటూ విజయసాయి ట్వీట్ చేశారు
అంతేకాకుండా, నారా లోకేశ్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. 'కొడుకేమో తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు' అంటూ ఎద్దేవా చేశారు. పార్టీలోని సీనియర్లంతా చేతులెత్తేశారని... ఎవరైతే ఏంటనే భావనతో 32 ఏళ్ల రామ్మోహన్ నాయుడికి ముళ్లకిరీటాన్ని చంద్రబాబు తగిలిస్తున్నారని అన్నారు. విశాఖ రాజధాని కాకుండా అడ్డుకోవాలని చూసి నవ్వులపాలయ్యారని... ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలను బుజ్జగించాలనే ఉద్దేశంతో అమాయకుడిని బలిపీఠం ఎక్కిస్తున్నారని చెప్పారు.