అటు ప్రపంచవ్యాప్తంగా, ఇటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వాలు, నిపుణులు సూచించిన అన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. గతేడాది కరోనా ఉధృతంగా ఉన్నప్పటి పరిస్థితినుంచి నేర్చుకున్న గుణపాఠాన్ని దృష్టిలో ఉంచుకుని సురక్షిత దూరం, మాస్కు ధరించడం, టీకాలు వేసుకోవడం వంటి కర్తవ్యాన్ని, మన కనీస ధర్మంగా పాటించడం ద్వారా వ్యక్తిగతంగా, సమాజాన్ని తద్వారా భారతదేశాన్ని మహమ్మారి బారి నుంచి కాపాడుకోగలమని ఆయన సూచించారు.
అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (ఏఏపీఐ) 15వ అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి ఉపరాష్ట్రపతి తమ సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతీయ సంతతి వైద్యులు ప్రపంచం నలుమూలల ఎక్కడకు వెళ్లినా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును పొందుతున్నారన్నారు. భారతీయ జీవన విధానమైన వసుధైవ కుటుంబకం స్ఫూర్తితో ప్రపంచానికి సేవలందిస్తున్నారన్నారు. భారతీయ విలువలకు, జీవన విధానానికి అంతర్జాతీయ ఆరోగ్య సేవా వారథులుగా వీరు పనిచేస్తున్నారని ఉపరాష్ట్రపతి కితాబిచ్చారు.
అమెరికా ఆధారిత సంస్థలు, భారతదేశ సంస్థలు పరస్పర సమన్వయంతో ఇటీవల కొర్బేవాక్స్, కోవోవాక్స్ టీకాలను రూపొందించిన విషయాన్ని ఉపరాష్ట్రపతి ఉద్ఘాటించారు. భారత్-అమెరికా సంస్థలు ఇలాగే సమన్వయంతో కలిసి పనిచేయడం ద్వారా ప్రపంచానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయన ఆకాంక్షించారు. భారతదేశంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న వైద్యసేవల అంతరాన్ని ఉపరాష్ట్రపతి ప్రస్తావిస్తూ, ఈ అంతరాన్ని తగ్గించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోనూ సరైన వైద్యసేవలు అందించేందుకు కృషి జరగాల్సిన అవసరం ఉందన్నారు. సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ టెలి మెడిసిన్ ద్వారా కూడా గ్రామాల్లో ప్రాథమిక వైద్యసేవలను విస్తరించేందుకు చొరవతీసుకోవాలన్నారు.
తాజా నీతి ఆయోగ్ ఆరోగ్య సూచీలో తెలంగాణ సాధించిన ప్రగతిని ఉపరాష్ట్రపతి అభినందించారు. ప్రతి ఏడాది ప్రగతిని సాధిస్తూ టాప్-3లో చోటు దక్కించుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. గ్రామాల దత్తత, ఇతర కార్యక్రమాల ద్వారా కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆపి ద్వారా జరిగిన సేవలను ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు. ఎంత ఎత్తుకెదిగినా మాతృభూమి, జన్మభూమి రుణం తీర్చుకోవడాన్ని విస్మరించకూడదన్నారు.