ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి శుక్రవారం విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన పలు అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవం చేయనున్నారు. మొత్తం రూ.247 కోట్ల వ్యయంతో చేపట్టే 12 రకాలైన అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. అలాగే, సాయంత్రం విశాఖలో జరిగే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనుమరాలి వివాహ రిస్పెప్షన్ కార్యక్రమానికి హాజరవుతారు. అలాగే, విజయనగరం జిల్లా డీసీసీబీ ఛైర్మన్ నెక్కల నాయుడు బాబు కుమార్తె వివాహానికి కూడా ఆయన హాజరవుతారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విశాఖలోనే ఉంటారు.
సీఎం జగన్ షెడ్యూల్...
సాయంత్రం 5 గంటలకు గన్నవరం నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి 5.20 గంటలకు ఎన్ఏడీ జంక్షన్‌లో ఎన్ఏడీ ఫ్లైఓవర్‌తో పాటు వీఎంఆర్‌డీఏ అభివృద్ధి చేసిన 6 ప్రాజెక్టులను ప్రారంభిస్తారు.
సాయంత్రం 6 గంటలకు విజయనగరం జిల్లాకు చెందిన పార్టీ నేత నెక్కల నాయుడు కుమార్తె వివాహానికి హాజరవుతారు. సాయంత్రం 6.20 గంటలకు ఉడా పార్కుతో పాటు జీవీఎంసీ అభివృద్ధి చేసిన మరో 4 ప్రాజెక్టలను ఆయన ప్రారంభిస్తారు.
రాత్రి 7 గంటలకు పీఎం పాలెం వైజాగ్ కన్వెన్షన్ సెంటరులో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనుమరాలు నిహారిక వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు. అక్కడ నుంచి రాత్రి 8 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరంకు చేరుకుంటారు.