వెస్ట్ గోదావరి జిల్లా జల్లేరు వాగులో బుధవారం ఆర్టీసీ బస్సు ఒకటి అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో తొలుత పది మంది మరణించినట్టు వార్తలు వచ్చాయి. కానీ, ప్రభుత్వం వెల్లడించిన వివరాల మేరకు ఈ ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోయారు. ఈ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. అలాగే, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
జల్లేరు వాగులోపడిన బస్సు
పశ్చిమ గోదావరి జిల్లాలోని జల్లేరు వాగులో ఆర్టీసీ బస్సు వాగులోపడిన ఘటనలో పది మంది వరకు మృత్యువాతపడ్డారు. ఈ బస్సు వంతెనపై వెళుతుండగా, నియంత్రణ కోల్పోయిన వాగులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు పది మంది మృతి చెందగా, ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
కాగా, బస్సు ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నుంచి జంగారెడ్డి గూడెంకు వెళుతుండగా జల్లేరు వాగులో ప్రమాదవశాత్తు పడిపోయింది. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు, అధికారులు స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్నవారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.