Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శబరిమల యాత్రికులారా... రైలులో క‌ర్పూరం, హార‌తులు వ‌ద్దు...

శబరిమల యాత్రికులారా... రైలులో క‌ర్పూరం, హార‌తులు వ‌ద్దు...
విజ‌య‌వాడ‌ , బుధవారం, 15 డిశెంబరు 2021 (15:10 IST)
దక్షిణ మధ్య రైల్వే శబరిమల యాత్రికుల ప్రయోజనార్థం 16 డిసెంబర్‌ 2021 నుండి శబరిమలకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది. ఈ ప్రత్యేక రైళ్లు జోన్‌ పరిధిలోని సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, కాచిగూడ, కాకినాడ, తిరుపతి, నాందేడ్‌ మొదలగు స్టేషన్ల నుండి ప్రారంభమై మార్గమధ్యలో అనేక స్టేషన్లలో ఆగుతాయి. వీటికి సంబంధించి సురక్షిత ప్రయాణం కోసం ప్రయాణికులు రైల్వే శాఖతో సహకరించాలని కోరుతున్నారు. 
 
 
ప్రయాణికులు రైలు కోచులలో పూజలు నిర్వహించడంలో భాగంగా హారతి వంటి కార్యక్రమాలు చేపట్టవద్దని రైల్వే విజ్ఞప్తి చేస్తుంది. రైలులో కర్పూరం వెలిగించడం మరియు అగ్గి పుల్లలు/అగరబత్తులు వెలిగించడం వంటివి చేయకూడదు. రైళ్లలో లేదా రైల్వే పరిసరాలలో అగ్ని కారక వస్తువులు/మండే స్వభావం గల వస్తువులు తీసుకెళ్లడం ఏ రూపంలోనైనా అగ్నిని వెలిగించడం వంటి పనులు చేయడం భద్రతా కారణాల వల్ల నిషేధించారు. ఇటువంటి కార్యకలాపాలు భద్రతా చర్యలకు విఘాతం కలిగిస్తాయి. ఇవి అగ్ని ప్రమాదాలకు దారితీసి ప్రాణహానికి దారితీస్తాయి మరియు రైల్వే ఆస్తుల నష్టానికి కారణాలవుతాయి.
 
 
ఇటువంటి కార్యకలాపాలు రైల్వే చట్టం`1989లోని సెక్షన్‌ 67,154,164 మరియు 165 క్రింద శిక్షార్హమైన నేరం. ఈ చట్టాన్ని ఉల్లంఘించి ప్రవర్తిస్తే వారిని ఆస్తినష్టం, ప్రాణ నష్టం వంటి కారణాలకు బాధ్యత చేస్తూ 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు లేదా రూ.1000/` జరిమానా విధించవచ్చు లేదా రెండు శిక్షలూ విధించవచ్చు. 
 
 
రైలు ప్రయాణికులు స్టేషన్లలో ఉన్నప్పుడు మరియు రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రయాణికుల భద్రత కోసం కోవిడ్‌ నిబంధనలను (మాస్కులు ధరించడం, అనవసర రద్దీని నివారించడం మొదలగునవి) కచ్చితంగా పాటించాలని రైల్వే సూచిస్తుంది. భద్రతాంశాలలో భాగంగా ఇటువంటి కార్యకలాపాలను నిరోధించడానికి రైల్వే రక్షక దళం సిబ్బందిచే మరియు కమర్షియల్‌ విభాగం సిబ్బందితో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించబడుతున్నాయి. ప్రయాణికులందరూ సురక్షితంగా ప్రయాణం చేయడానికి రైలు ప్రయాణికులందరి సహకారాన్ని రైల్వే వారు కోరుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మృత్యువుతో పోరాటం : ఓడిపోయిన కెప్టెన్ వరుణ్ సింగ్