తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ దంపతులతో పాటు మరో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చిత్తూరుకు చెందిన లాన్స్ నాయక్ సాయితేజ ఉన్నారు. ఇప్పటివరకు ఆయన డెడ్ బాడీని అధికారులు గుర్తించ లేదు.
ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు లేఖ రాసారు. భరతమాతకు సేవ చేయాలని 20 ఏళ్ల వయసులోనే ఆర్మీలో చేరి, 29 ఏళ్లకే అమరుడైన లాన్స్ నాయక్ సాయితేజకు తెలుగుదేశం పార్టీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తోందన్నారు.
హెలికాప్టర్ ప్రమాదంలో వీరమరణం పొందిన సాయితేజ కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం అందజేయడంతోపాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం సాయితేజ కుటుంబాన్ని తక్షణమే అన్నివిధాలా ఆదుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో సాయి తేజ కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియాను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. సరిహద్దులో ఉగ్రవాదులతో పోరాడటంలో చేసిన శౌర్యం చాలా ప్రశంసనీయమని, మృతుల కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని తెలియజేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.