పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో అమరావతి రైతులు చేపట్టిన మహోద్యమ పాదయాత్ర ముగింపు బహిరంగ సభ శుక్రవారం తిరుపతిలో జరుగనుంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో వారు ఏకధాటిగా 44 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్ర చివరి అంకంగా తిరుపతిలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఇప్పటికే ఆ ప్రాంత రైతులు, మహిళలు ఈ పాదయాత్రలో భాగస్వామ్యులైన విషయం తెల్సిందే.
ఈ నేపథ్యంలో అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ పేరుతో నిర్వహించే ఈ బహిరంగ సభకు పలు రాజకీయ పార్టీల నేతలు హాజరుకానున్నారు. ఈ విషయాన్ని రైతుల సంఘాల సమాఖ్య ఐకాస నేతలు వెల్లడించారు. ఈ బహిరంగ సభ తిరుపతి పరిధిలోని దామినీడు అనే ప్రాంతంలో జరుగనున్నాయి.
ఈ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తుండటంతో భారీగానే ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ రాష్ట్ర శాఖ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తదితరులు హాజరుకానున్నారు. కాగా, ఈ సభ సాయంత్రం 6 గంటలకు ముగించాలని హైకోర్టు షరతు విధించిన విషయం తెల్సిందే.