కోలీవుడ్ నటుడు సంతానం చిక్కుల్లో పడ్డారు. ఆయన నటించిన తాజా చిత్రం డీడీ నెక్స్ట్ లెవల్ చిత్రంలో ఆ కలియుగ శ్రీనివాసుడుని కించపరిచేలా ఓ ర్యాప్ పెట్టారు. దీనిపై శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై తితిదే బోర్డు సభ్యుడు, బీజేపీ ఏపీ శాఖ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన నటుడు సంతానంతో పాటు చిత్ర నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్టైన్మెంట్‌కు లీగల్ నోటీసు పంపారు.
'డీడీ నెక్స్ట్ లెవెల్' చిత్రం మే 16న థియేటర్లలో విడుదలైంది. అయితే, విడుదలకు కేవలం రెండు రోజుల ముందు, చిత్రంలోని 'కిస్సా 47' అనే ర్యాప్ పాటలో 'శ్రీనివాసా... గోవిందా' కీర్తనను ఉపయోగించడం హిందూ మనోభావాలను దెబ్బతీసేలా ఉందని భానుప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. "ర్యాప్ పాటలో ' శ్రీనివాసా... గోవిందా'ను ఉపయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. క్రైస్తవ లేదా ఇస్లాం మతాలకు సంబంధించిన ప్రార్థనలను ఇలా ర్యాప్ పాటల్లో ఉపయోగిస్తారా? ఎప్పుడూ హిందూ మనోభావాలనే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటారు?" అని ఆయన ప్రశ్నించారు.
చిత్ర నిర్మాతలు, నటుడు సంతానం తక్షణమే క్షమాపణ చెప్పాలని, సినిమా నుంచి ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌ల నుంచి ఆ వివాదాస్పద గీతాన్ని తొలగించాలని డిమాండ్ చేసినట్లు భానుప్రకాశ్ రెడ్డి తెలిపారు. ఒకవేళ వారు ఆ పాటను తొలగించకపోతే, రూ.100 కోట్ల నష్టపరిహారం కోరుతూ పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
అలాగే, సెన్సార్ బోర్డుపై కూడా ఆయన పలు ప్రశ్నలు సంధించారు. భవిష్యత్తులో ఏ చిత్ర నిర్మాత కూడా భక్తిగీతాలను ఇలా తేలికగా సినిమాల్లో వాడుకుని, మనోభావాలు దెబ్బతిన్నాయని ఎత్తి చూపినప్పుడు కేవలం క్షమాపణ చెప్పి తప్పించుకోకూడదని భానుప్రకాశ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ లీగల్ నోటీసు కాపీని సెన్సార్ బోర్డుకు కూడా పంపామని, సినిమాలకు ధృవీకరణ పత్రాలు జారీ చేసేటప్పుడు వారు మరింత జాగ్రత్త వహించాలని సూచించారు. "అసలు సెన్సార్ బోర్డు అధికారులు ఈ అంశాన్ని ఎలా విస్మరించారు?" అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.