తిరుమలలో హుండీ కానుకలు లెక్కించే విభాగం పరకామణిలో వంద కోట్లకు పైగా దొంగతనం జరిగినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యుడు, బీజేపీ నాయకుడు భాను ప్రకాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ భారీ కుంభకోణం జరిగిందని, దేవస్థానం అధికారులు, పోలీసులు, వైసిపి నేతలు కలిసి స్వామివారి సొమ్మును దోచుకున్నారని ఆరోపించారు. ఈ ఘటనలో కీలక పాత్ర పోషించిన సి.వి.రవికుమార్‌కు సంబంధించిన వీడియోలు, డాక్యుమెంట్లు విడుదల చేశారు. హైకోర్టు ఆదేశాలు, లోక్ అదాలత్ రాజీల వివరాలను బయటపెట్టారు.
పెద్ద జీయర్ మఠం క్లర్క్ గా ఉన్న సి.వి.రవికుమార్.. 2023 ఏప్రిల్ 29న తిరుమల పరకామణిలో దొంగతనం చేస్తుండగా టిటిడి విజిలెన్స్, సెక్యూరిటీ విభాగాలు పట్టుకున్నాయి. విదేశీ కరెన్సీను పెద్దఎత్తున ఇలా దొంగలించినట్లు గుర్తించారు. దాదాపు ఆయన రూ. 200 కోట్లకు పైగా దొంగతనం చేసి, ఆ మొత్తంతో రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టుకున్నాడనే ఆరోపణలున్నాయి.
అయితే రవికుమార్ దొంగతనాల వెనుక టిటిడి అధికారులు, విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ శివశంకర్, పోలీసు అధికారులు కూడా ఉన్నట్టు భాను ప్రకాష్ రెడ్డి వెల్లడించారు. టిటిడి చరిత్రలో ఇది అత్యంత భారీ దొంగతనం అని ఆయన అన్నారు. ఇలా దోచుకున్న సొమ్ములో కొంత భాగం మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నివాసమైన తాడేపల్లి ప్యాలెస్‌కు చేరిందన్నారు.
టిటిడి చైర్మన్ గా భూమన్ కరుణాకర్ రెడ్డి హయాంలోనే ఈ దొంగతనాలు జరిగాయని, దీనిపై ఆయన సమాధానం చెప్పాలని భానుప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇకపోతే.. రవికుమార్ మీద 2023 మే 30న ఎఫ్‌ఐఆర్ నమోదైంది. జూన్‌లో చార్జ్ షీట్ దాఖలైంది. కానీ, సెప్టెంబర్ 9న లోక్ అదాలత్‌లో రాజీ చేసుకుని కేసు క్లోజ్ అయింది.
ఈ వార్తలపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఎక్స్‌లో పోస్టు పెట్టారు. వైసిపి గజదొంగలు శ్రీవారి సొత్తూ దోచుకున్నారు. వందకోట్ల పరకా'మనీ దొంగ' వెనుక వైసీపీ నేతలు జగన్ ఐదేళ్ల పాలనలో అవినీతి రాజ్యమేలింది. అరాచకం పెచ్చరిల్లింది.
దొంగలు, దోపిడీదారులు, మాఫియా డాన్లకు వైకాపా కేరాఫ్ అడ్రస్ అని నారా లోకేష్ ఫైర్ అయ్యారు. గనులు, భూములు, అడవులు, సమస్త వనరులతోపాటు జనాన్ని దోచుకున్న జగన్ గ్యాంగ్... చివరకు తిరుమల శ్రీవారి సొత్తునూ వదలలేదు. తాడేపల్లి ప్యాలెస్ ఆశీస్సులు, నాటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అండదండలతో తిరుమల పరకామణిలో దొంగలు పడ్డారు.
కోట్ల సొత్తు కొల్లగొట్టారు. ఈ డబ్బు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారు. ఇందులో వాటాలను తిరుపతిలో భూమన నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు అందాయని నిందితులే చెబుతున్నారు. అధికారం అండతో జగన్ గ్యాంగ్ శ్రీవారికి చేయని అపచారం లేదు. భక్తులు మహా ప్రసాదంగా భావించే లడ్డూని కల్తీ చేశారు. అన్న ప్రసాదాన్ని భ్రష్టు పట్టించారు. తిరుమల దర్శనాలను అమ్మేసి సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం దుర్లభం చేశారు.
ఏడుకొండల జోలికి వెళ్ళవద్దు, శ్రీవారికి అపచారం తలపెట్టవద్దు అని.. నాడు జగన్మోహన్ రెడ్డికి బతిమాలి చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు గారు.. అయినా వినలేదు. అందుకే జగన్ గ్యాంగ్ పాపం పండింది. పరకామణి వీడియోలు ఈరోజు బయటపడ్డాయి. రేపు నిందితులే వైసీపీ పాపాల చిట్టా విప్పబోతున్నారు.. అంటూ నారా లోకేష్ వెల్లడించారు.