ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తోంది. ఇందులోభాగంగా, రాష్ట్ర వ్యాప్తంగా 4,472 గ్రామాల్లో విలేజ్ క్లినిక్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు రూ.1,129 కోట్ల వ్యయంతో సొంత భవనాలను నిర్మించనున్నారు. విలేజ్ క్లినిక్ నిర్మాణ పనులను ఏడాదిలోపు పూర్తి చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు.
విలేజ్ క్లినిక్‌ల నిర్మాణంతో గ్రామీణ వైద్య సేవలకు మహర్దశ రానుందని ఆయన పేర్కొన్నారు. విలేజ్ క్లినిక్ నిర్మాణ పనులకు అవసరమయ్యే మొత్తం ఖర్చులో 80 శాతం కేంద్రమే భరిస్తుందని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో మరో 1,379 నూతన భవనాలను రూ.753 కోట్లతో నిర్మించాల్సి ఉందని తెలిపారు. వీటిని 16వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని మంత్రి తెలిపారు.
రూ.1129 కోట్ల వ్యయంతో చేపట్టనున్న భవన నిర్మాణ పనుల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 284 విలేజ్ హెల్త్ క్లినిక్‌కు సొంత భవనాలు ఏర్పడనున్నాయి. తదుపరి స్థానాల్లో నంద్యాల జిల్లాలో 272, ఏలూరు జిల్లాలో 263, కోనసీమ జిల్లాలో 242, కృష్ణా జిల్లాలో 240, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 239, చిత్తూరు జిల్లాలో 229, బాపట్ల జిల్లాలో 211, పార్వతీపురం మన్యం జిల్లాలో 205, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల్లో 203, అనకాపల్లి జిల్లాలో 200 చొప్పున నూతన భవనాలు ఏర్పడతాయని, రాయలసీమలోని తిరుపతి, కర్నూలు, అన్నమయ్య, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 100కి పైగా నూతన భవనాలను నిర్మిస్తారని మంత్రి తెలిపారు.