ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఇంటికి కుటుంబ కార్డు జారీ చేస్తామని, ఇది కుటుంబాలు పొందుతున్న అన్ని ప్రభుత్వ పథకాల వివరాలను నమోదు చేస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ కార్డు ఆధార్‌తో అనుసంధానించబడిన సామాజిక గుర్తింపు పత్రం లాంటిదని చంద్రబాబు తెలిపారు.
గురువారం సచివాలయంలో కుటుంబ ప్రయోజన పర్యవేక్షణ వ్యవస్థను సమీక్షించిన ముఖ్యమంత్రి, సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ప్రజల సంతృప్తి ముఖ్యమని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతను కొనసాగించడానికి అధికారులు ప్రతి కుటుంబానికి కుటుంబ స్కోరును కేటాయించాలన్నారు.
సంక్షేమ పథకాల ప్రయోజనాల వివరాలను కుటుంబ కార్డులో నవీకరించాలని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.పేదల ఆర్థికాభివృద్ధి కోసం ప్రతి కుటుంబంలోని సభ్యులందరికీ కుటుంబ కార్డును పంపిణీ చేయాలి. ప్రతి కుటుంబం నిర్దిష్ట అవసరాలను అంచనా వేయడానికి క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
సంక్షేమ ప్రయోజనాలు ఆలస్యం లేకుండా సరైన వ్యక్తులకు చేరేలా మన వ్యవస్థ నిర్ధారించాలి. సామాజిక పునర్నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని చంద్రబాబు తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఉల్లి రైతులకు నష్టం వాటిల్లకూడదు. క్వింటా ఉల్లిని రూ. 1,200 చొప్పున కొనుగోలు చేయండి. తక్షణం కొనుగోళ్లు ప్రారంభించాలి. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ నుంచి నష్టాన్ని భరించాలి. కమ్యూనిటీ హాళ్లను అద్దెకు తీసుకుని ఉల్లిని ఆరబెట్టాలి.
ఆరబెట్టిన ఉల్లిని రైతు బజార్లకు పంపిణీ చేయాలి. ఉల్లికి రేటు వచ్చేంత వరకు కమ్యూనిటీ హాళ్లలో నిల్వ చేసుకునేందుకు రైతులకు అవకాశం కల్పించాలి. రైతు నష్టపోకూడదు. వినియోగదారుడు ఇబ్బంది పడకూడదు. అన్ని పంటల ధరల స్థిరీకరణ కోసం వేర్ హౌసింగ్ సదుపాయం కల్పించాలని ముఖ్యమంత్రి అన్నారు.